Tuesday, May 21, 2024
- Advertisement -

బడుగు బలహీన వర్గాలకు ఇంగ్లిష్ అవసరం లేదా?

- Advertisement -

అధికారంలో ఉన్నప్పుడు వీలు దొరికినప్పుడల్లా దళితులని అవమానించిన తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రజలంతా బుద్ధి చెప్పినా ఇప్పటికీ తన తీరు మార్చుకోవడం లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని ఏదో ఒక విధంగా అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు గారు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇంగ్లిష్ మీడియంపై తన వాళ్లతో హైకోర్టులో పిటిషన్ వేయించి పేదల జీవితాల్లో నిప్పులు పోసారు. కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని పిటిషనర్ సుధీష్ రాంభొట్ల ఇంగ్లిష్ లో తన సందేశాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. ఇదీ ఆయనకు తెలుగు మీద ఉన్న ప్రేమ.

ఇవన్నీ పక్కన పెడదాం మీడియం గురించి చర్చిద్దాం.
ఇంగ్లీష్ మీడియం వల్ల తెలుగు అంతరించిపోతుందని చెబుతున్నారు, తెలుగు సంస్కృతి నాశనమవుతుందని బాధపడుతున్నారు. మరి ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో తెలుగు సంస్కృతి నాశనం కావడం లేదా? ఈ సంస్కృతిని కాపాడవలసిన బాధ్యత పేద బడుగు బలహీన వర్గాల పిల్లలదా? ప్రైవేట్ పాఠశాలలతో సహా అన్ని బడుల్లో తెలుగు మీడియం ఉండాలని పిటిషనర్ ఎందుకు కోరలేదు? ఎందుకంటే మళ్లీ కార్పొరేట్ పాఠశాలలన్నీ చంద్రబాబు బినామీలవే కాబట్టి.

వారు చెబుతున్న రెండో విషయం పిల్లలకు ఇంగ్లిష్ మీడియం వల్ల అర్థం కాదని. నిజమే పిల్లలకు మాతృభాషలో విషయావగాహన చక్కగా జరుగుతుంది. అదేసమయంలో పిల్లల్లో కొత్త భాష నేర్చుకునే సామర్థ్యం పెద్దల కంటే అధికంగా ఉంటుందని శాస్త్రీయంగా నిరూపించబడింది. ఒక సంవత్సరం ఇబ్బందిపడ్డా, కష్టపడ్డా ఆ తర్వాత మంచి భవిష్యత్తు ఉంటుంది.

వారి లెక్క ప్రకారం కార్పొరేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కూడా విషయావగాహన ఉండకూడదు. కానీ ఐఐటీ, మెడిసిన్ లో మొత్తం ర్యాంకులన్నీ మావే అని కార్పొరేట్ కాలేజీలు పేజీలకు పేజీలు గంటలు గంటలు అడ్వటైజ్మెంట్ ఇస్తూ ఉన్నాయి. మరి ఏది నిజం? పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివితే విషయావగాహన ఉండదు, అదే డబ్బున్నవారి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివితే ఐఐటి మెడిసిన్ సీట్లు వస్తాయా?

ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల ఉపాధ్యాయులు బోధించ లేరు అన్నది వారు చెబుతున్న మూడో కారణం. ఇది ప్రభుత్వ ఉపాధ్యాయులను కించపరచడమే అవుతుంది.‌ అత్యంత కఠినమైన పరీక్షలో నెగ్గిన వారే ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉంటున్నారు. వారికి కాస్త సమయం ఇస్తే ఇంగ్లీషులో చెప్పలేరా? అసలు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో బోధన మొత్తం ఇంగ్లీష్ లోనే జరుగుతోందా? లేదు ఇంగ్లీష్ తెలుగు కలగలిపి చెబుతున్నారు. అస్సలు తెలుగు ఉపయోగించని పాఠశాలలను రాష్ట్రం మొత్తంమీద వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. అదే పద్ధతి ప్రభుత్వ పాఠశాలల్లో కూడా కొద్ది రోజులు అమలు అవుతుంది. ప్రభుత్వం ఇప్పటికే లక్షలాది మంది ఉపాధ్యాయులకు ఇంగ్లిష్ లో శిక్షణ కూడా ఇచ్చింది. కాబట్టి ఉపాధ్యాయుల మీద వేస్తున్న నెపం కూడా ఆధారం లేనిదే.

పిటిషనర్కు నిజంగానే విద్యార్థుల మీద విద్యార్థుల భవిష్యత్తు మీద ప్రేమ ఉన్నట్టయితే ఆయన డిమాండ్ చేయాల్సినవి ఇవి. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచాలి, అన్ని పాఠశాలలు‌ గురుకుల పాఠశాలల్లో, కళాశాలల్లో వీలైనంత త్వరగా ఖాళీలు భర్తీ చేయాలి, ఉపాధ్యాయుల నైపుణ్యాలు పెంచడానికి శిక్షణ ఇవ్వాలి, పాఠశాలల్లో వసతులు కల్పించాలి, పౌండేషన్ కోర్సుల పేరుతో పిల్లలపై ఒత్తిడి తెచ్చి ఆత్మహత్యలకు పురిగొల్పుతున్న కార్పొరేట్ విద్యా సంస్థలను నియంత్రించాలి, పిల్లల చదువుల కోసం అప్పులపాలు అవుతున్న పేద మధ్యతరగతి ప్రజలను రక్షించమనాలి, ధనిక పేద కుల మత తేడాలు లేని కామన్ స్కూల్ సిస్టం ప్రవేశపెట్టాలి. ఇవన్నీ సదరు పిటిషనర్కు అవసరం లేదు. ఎందుకంటే ఇవన్నీ అట్టడుగు వర్గాల పిల్లల అభ్యున్నతికి తోడ్పడేవి.

అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిక్షణం పేదల కోసం తపించే వ్యక్తి. ఇప్పుడు పైన చెప్పిన పాయింట్లన్నీ త్వరలోనే అమలు కానున్నాయి.

నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోనున్నాయి. ప్రైవేటు పాఠశాలల కంటే అద్భుతమైన వసతులు ప్రభుత్వ బడుల్లో ఉండబోతున్నాయి. ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. కాబట్టి ప్రభుత్వ పాఠశాలల పురోగతిని ఎవరూ అడ్డుకోలేరు.

అత్యంత దురదృష్టకరమైన విషయం ఏమిటంటే పేద పిల్లల ద్వారా తెలుగు సంస్కృతిని కాపాడాలని చెబుతున్న వారి పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నవారే, వాళ్ల పిల్లలు విదేశాల్లో ఉంటున్నారు.

చంద్రబాబునాయుడు గారు మరియు తెలుగుదేశం పార్టీ ఇలాంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఇంకా ఇంకా చేస్తుంది. దయచేసి ప్రజలంతా గమనించండి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం వద్దని ఈరోజు తన అనుచరులతో కోర్టు కేసు వేయించిన చంద్రబాబు వల్ల అట్టడుగు వర్గాల ప్రజలు చాలా నష్టపోనున్నారు. భవిష్యత్తులో మిగతా వర్గాలను కూడా ఏదో రకంగా నష్ట పరచాలని చూస్తారు. చంద్రబాబు అరాచకాలకు విసిగి వేసారి పార్టీ మొత్తాన్ని జనం తరిమి తరిమి కొట్టే రోజు చాలా దగ్గర్లోనే ఉందని భావిస్తున్నాను.

-జొన్నలగడ్డ పద్మావతి
ఎమ్మెల్యే, శింగనమల నియోజకవర్గం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -