తెలుగుదేశం పార్టీకి వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత గట్టిగా జవాబిచ్చాడు. తెలుగుదేశం నేతలు ప్రతిపక్ష పార్టీని ‘సైకో’ పార్టీ అనగా.. జగన్ దాన్ని తెలివిగా తిప్పికొట్టాడు.
ముందుగా తెలుగుదేశం నేత, మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జగన్ పార్టీని సైకో పార్టీ అన్నాడు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సభలో గలాభా సృష్టించారు. స్పీకర్ పోడియంను చుట్టుమట్టి నిరసన తెలిపారు. ఆ తర్వాత జగన్ కు మాట్లాడే అవకాశం వచ్చింది.
ఆ సందర్భంలో జగన్ మాట్లాడుతూ.. తెలుగుదేశం తీరును ఎండగట్టాడు. తమ పార్టీని సైకో పార్టీ తెలుగుదేశం వారు అంటున్నారని.. ఆ మాటను వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను అని జగన్ వ్యాఖ్యానించాడు. తెలుగుదేశం పార్టీకి ఇలాంటి రౌడీనైజం అలవాటే అని.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రౌడీ లా మాట్లాడతాడని.. వేలు చూపిస్తూ భయపెట్టేలా మాట్లాడతాడని.. తెలుగుదేశం నేతలందరికీ ఇలాంటి రౌడీయిజం అలవాటే అని జగన్ వ్యాఖ్యానించాడు.
ఈ విధంగా “రౌడీ పార్టీ” అంటూ వైకాపా అధినేత తెలుగుదేశం వారికి గట్టిగా సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వైపు నుంచి గలాభా రేగింది. జగన్ మాటలతో అధికార పార్టీ వారు ఊగిపోయారు. ఆగ్రహోద్రిక్తులు అయ్యారు. ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు లేచి ఏదేదో మాట్లాడాడు. జగన్ రౌడీ అంటూ విరుచుకుపడ్డాడు. ఆయన అలా రెచ్చిపోతున్నా జగన్ మాత్రం చిద్విలాసంగా నవ్వుతూ కూర్చొన్నాడు!
