Saturday, May 18, 2024
- Advertisement -

ఏపీలో ఎమ్మెల్యేలకు జనసేన గాలం

- Advertisement -

జనసేన పార్టీ కూడా ఇతర పార్టీలకు ఏమాత్రం తీసిపోదని తేలిపోయింది. అవినీతికి దూరంగా కొత్త రాజకీయం చేస్తామంటూ చెప్పుకొచ్చిన పవన్ కళ్యాణ్, ఉన్నపార్టీల ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుపుతున్నారు. ఉత్తరాంధ్ర నేతల విషయంలో ప్రధానంగా కులం ఆధారంగా ఆయన కులరాజకీయాలు నడుపుతున్నారు. టీడీపీ, వైఎస్ఆర్ సీపీ, బీజేపీ అని తేడా లేకుండా అన్ని పార్టీల ఎమ్మెల్యేలతోనూ పవన్ టచ్ లో ఉంటున్నారు. ఇప్పటికే ఏపీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని జనసేన రాష్ట్ర కన్వీనర్ వి పార్థసారథి వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు మేడా గురుదత్ ప్రసాద్, ఉభయగోదావరి జిల్లాల జనసేన కన్వీనర్ కలవకొలను తులసితో కలసి ఆయన మీడియాతో రాజమండ్రిలో మాట్లాడారు. అన్ని పార్టీల నుంచి ముఖ్యనాయకులు జనసేనలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. త్వరలో పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు వీళ్లంతా జనసేన తీర్ధం పుచ్చుకుంటారని వివరించారు. తమ పార్టీలో కొత్తతరానికి ప్రాధాన్యత ఎక్కువిస్తామని జనసేన వర్గాలు పదే పదే చెప్పుకుంటున్నాయి. కొత్త తరం, యువతకు 60 శాతం, పాత తరం నాయకులకు 40 శాతం టికెట్లు ఇవ్వాలని తమ అధ్యక్షుడు యోచిస్తున్నట్లు పార్ధసారథి తెలిపారు.

అయితే ‘అనుభవజ్ఞులు’. అనే ట్యాగ్ లైన్ తో ఇతర పార్టీల్లో ఉన్న వారితో బేరసారాలు జరిపి జనసేనలో చేర్చుకోవాలనే ఆలోచనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే వివిధ పార్టీల్లో ఉన్నవారిలో అవినీతికి దూరంగా, నీతిగా నిజాయతీగా ప్రజా సేవ చేస్తున్నవారిని వేళ్లమీద కూడా లెక్కపెట్టలేని స్థాయి. దాదాపు ప్రతి ఒక్కరూ అవినీతి, అక్రమాలు, బంధుప్రీతి, కుల, ధన రాజకీయ మరక అంటించుకున్నవాళ్లే. అలాంటి వారిని అనుభవజ్ఞులు పేరుతో జనసేనలో చేర్చుకోవాలనుకోవడం కొత్త సీసాలో పాత సారా వంటిదేనని విద్యావేత్తలు, రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. అంటే ఆట మారుతుంది తప్ప ఆటగాళ్లు మారరన్నమాట… అంటూ జనసేన రాజకీయాలను ఎండగడుతున్నారు. ఈ మాత్రం దానికి కొత్త పార్టీ ఎందుకు ? పాత పార్టీల్లో ఉన్నవారిని మీ పార్టీలో చేర్చుకునే బదులు, మీరే పాత పార్టీలో చేరిపోతే మంచిది కదా అని సూచిస్తున్నారు. మీ అన్నయ్య చిరంజీవి చేసింది కూడా అదే కదా…అని గుర్తు చేస్తున్నారు. ప్రతి 30 ఏళ్లకు ఒకసారి రాజకీయాల స్వరూపమే మారిపోతుంది. కొత్త తరం, కొత్త పార్టీలు పుట్టుకొస్తాయి. ఇప్పటికే 30 ఏళ్లు పూర్తి చేసుకున్న టీడీపీ పని ఇక అయిపోయినట్టేనిని ఆ మధ్య బహిరంగ సభల్లో చెప్పుకొచ్చిన పవన్ కళ్యాణ్….ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలను తమ పార్టీలో చేర్చుకోవాలని భావించడం ఏంటో అర్థం కాని ప్రశ్న.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -