Wednesday, May 15, 2024
- Advertisement -

కుర్చీలో కూర్చుంటే పొద్దే తెలియ‌ని సీఎం

- Advertisement -

ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబును మించిన కార్య‌ద‌క్ష‌త ఉన్న‌వాళ్లు మాత్రం మరొక‌రు ఉండ‌రు. రాజ‌కీయ నాయకుడిగా ఎన్ని కుతంత్రాలు చేసినా.. పాల‌న విష‌యంలో మాత్రం చంద్ర‌బాబును వేలెత్తి చూడానికి లేదు. దేశంలో మ‌రే రాష్ట్ర ముఖ్య‌మంత్రికీ సాధ్యం కానంత ఎక్కువ స‌మ‌యం చంద్ర‌బాబు పాల‌న కోసం కేటాయిస్తారు. ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడే జె.సి.దివాక‌ర్‌రెడ్డి లాంటి వాళ్లు బ‌హిరంగంగా వేదిక‌ల‌పైనే.. చంద్ర‌బాబుకు ముఖ్య‌మంత్రి అనేది అదృష్ట‌మో.. దుర‌దృష్ట‌మో అర్థం కావ‌డం లేద‌ని వ్యాఖ్యానించ‌డంలో త‌ప్పు లేద‌నిపిస్తుంది. ఎప్పుడు చూసినా.. స‌మీక్ష‌లు, విదేశీ, స్వ‌దేశీ పెట్టుబ‌డుల ఆహ్వాన స‌ద‌స్సులు, యాత్ర‌లు అంటూ.. చంద్ర‌బాబు తీరిక లేకుండా ఉంటుంటార‌ని, క‌నీసం ఆయ‌న మ‌న‌వ‌డితో గ‌డిపే స‌మ‌యం కూడా లేకపోవ‌డం చూస్తే.. జాలేస్తోందంటూ ఇటీవ‌ల జేసీ ఓ బ‌హిరంగ స‌భ వేదిక‌పై వ్యాఖ్యానించారు.

చంద్ర‌బాబునాయుడి దిన‌చ‌ర్య చూసే వారెవ‌రికైనా ఇదే మాట అనిపించ‌క మాన‌దు. ఉద‌యం 9గంట‌ల‌కు ఏపీ స‌చివాల‌యానికి వ‌స్తే.. రాత్రి 11 గంట‌ల వ‌ర‌కూ త‌న ఛాంబ‌ర్‌లోని గ‌దిలోనే క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతుంటారు. ఎక్క‌డికైనా ప‌ర్య‌టన‌లు, కార్య‌క్ర‌మాల‌కు హాజ‌ర‌వ్వాల్సింది ఉంటే త‌ప్ప‌.. చంద్ర‌బాబు కుర్చీలోంచి లేవ‌రు. రోజ‌కు 12 నుంచి 14గంట‌లు ప‌నిచేస్తుంటారు. చంద్ర‌బాబు వ‌య‌సు 68 ఏళ్లు. ఈ వ‌య‌సులోనూ కుర్చీలో నిటారుగా ఎనిమిది గంట‌లు లేవ‌కుండా కూర్చోగ‌ల సామ‌ర్థ్యం ఆయ‌న సొంతం. సాధార‌ణంగా ముఖ్య‌మంత్రి అంటే పాల‌న కంటే.. హోదా అనుభ‌వించ‌డానికే అత్య‌ధికులు ఆస‌క్తి చూపుతుంటారు. కానీ.. చంద్ర‌బాబు మాత్రం ఎంత‌సేపూ పాల‌న‌కే అధిక స‌మ‌యం కేటాయిస్తారు. చంద్ర‌బాబు 68 ఏళ్ల వ‌య‌సులోనూ.. ఏమాత్రం ఇబ్బంది ప‌డ‌కుండా.. ఉద‌యం నుంచి సాయంత్రం వ‌ర‌కూ ఒకేచోట కూర్చుని ఉండ‌గ‌ల‌గే సామ‌ర్థ్యం ఆయ‌న క్ర‌మం త‌ప్ప‌ని వ్యాయామం, యోగా, మితాహారం వ‌ల్లే సాధించ‌గ‌లిగారు. చంద్ర‌బాబు ఆహారం చాలా మితంగా ఉంటుంది. ఉద‌యం రెండు ఇడ్లీలు లేదంటే ఓట్స్‌తో చేసిన ఉప్మా తింటారు. ఈ రెండు లేకుంటే ఓ దోశ కొంచెం చ‌ట్నీతో తీసుకుంటారు. వీటితో పాటూ ఏదైనా ఒక పండు తింటారు. మ‌ధ్యాహ్నం కొద్దిగా రాగి, జొన్న‌, స‌జ్జ అన్నం, రెండు మూడు కూర‌గాయ‌లు, ఒక డ్రైఫ్రూట్ తీసుకుంటారు. అంతే మ‌ళ్లీ సాయంత్రం 6.30 నుంచి 7గంట‌ల మ‌ధ్య‌లో ఏదైనా ఓ సూప్, దానితో ఒక‌టి లేక రెండు గుడ్లు తింటారు. అదే రాత్రి భోజ‌నం కింద లెక్క‌. రాత్రి ప‌డుకోబోయే ముందు.. పాలు తాగుతారు. ఇదీ చంద్ర‌బాబు రోజువారీ ఆహారం.

అందుకే.. త‌ర‌చూ ఆయ‌న తాను స‌ర్వ‌సాధార‌ణ ఆహారం తింటాన‌ని, మీలా హాటు, స్వీటు వంటి రిచ్‌మెన్ ఫుడ్ తిన‌లేనంటూ జోక్ చేస్తుంటారు. దీనికితోడు ఖ‌చ్చితంగా ఆరుగంట‌లు రాత్రి ప‌డుకుంటారు. ఉద‌యం లేవ‌గానే ఖ‌చ్చితంగా వ్యాయ‌మం, యోగా చేస్తారు. నోటిని క‌ట్టుకుని, కోరిక‌ల‌ను అణుచుకోగ‌లిగి.. జిహ్వ‌చాప‌ల్యాన్ని త‌గ్గించుకుంటే ఎలాంటి స‌మ‌స్య‌లూ రావంటూ చంద్ర‌బాబు చెబుతుంటారు. ఏటా నిర్వ‌హించే యోగాడే రోజున చంద్ర‌బాబు ప‌ద‌హారేళ్ల పిల్లాడి కంటే బాగా త‌న శ‌రీర భాగాల‌ను వంచుతూ ఆస‌నాలు వేయ‌డం చూసేవారిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తుంటుంది. 70 ఏళ్ల‌కు స‌మీపించినా.. శ‌రీరాన్ని ఇంత కంట్రోల్‌లో ఉంచుకోవ‌డం చూసి.. ఆయ‌న ప‌క్క‌నే యోగాస‌నాలు వేసేందుకు ప్ర‌య‌త్నించే 50లోపు నాయ‌కులంతా ఆశ్చ‌ర్య‌పోతూ ఉంటారు. క‌నీసం న‌డుమును సైతం స‌రిగా వంచ‌లేక వారు ప‌డే ఫీట్లు అన్నీ ఇన్నీ కావు. ఏపీ సెక్ర‌టేరియ‌ట్‌కు వెళ్లి చూస్తే.. ఒక‌రి త‌ర్వాత ఒక‌రు పారిశ్రామిక వేత్త‌లు, మంత్రులు, నాయ‌కులు, అధికారులు, ప్ర‌జ‌లు వ‌చ్చి వెళ్తూనే ఉంటారు.. కానీ.. చంద్ర‌బాబు మాత్రం అలాగే ఏమాత్రం అల‌స‌ట లేకుండా.. ఏక‌ధాటిగా గంట‌ల త‌ర‌బ‌డి కూర్చునే ఉంటారు. అందుకే.. చంద్ర‌బాబును ప‌నిరాక్ష‌సుడ‌ని ఊర‌కే అన‌లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -