Sunday, May 5, 2024
- Advertisement -

రాష్ట్ర రాజ‌కీయాల‌న్నీ వీరి చుట్టూనే తిర‌గ‌డానికి కార‌ణం అదే

- Advertisement -

రాష్ట్రంలో కాపుల చుట్టూనే 2019 ఎన్నిక‌లు తిర‌గ‌బోతున్నాయ‌ని ఇప్పటికే స్ప‌ష్ట‌మ‌వుతోంది. అందుకే కాపుల ఓట్ల‌ను చేజిక్కించుకునేందుకు ఎవ‌రికి వారు త‌మ ప్ర‌య‌త్నాల‌ను చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే బీజేపీ త‌న రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లో భాగంగా కాపులంద‌రినీ ఒక‌చోటికి చేర్చి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బ‌ల‌ప‌డేందుకు.. ఏకంగా ఆ పార్టీ అధ్య‌క్షుడిగా కాపునేత‌.. క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ను నియ‌మించింది. అనూహ్యంగా రాత్రికి రాత్రి క‌న్నా బీజేపీకి దిక్క‌యిపోవ‌డానికి కార‌ణం.. ఆయ‌న సామాజిక వ‌ర్గ‌మేన‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే. దీనికితోడు బీజేపీ ఒక‌వైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, మ‌రోవైపు.. మాజీ ఐపీఎస్ అధికారి జేడీ ల‌క్ష్మినారాయ‌ణ‌ను సైతం ప్ర‌జాక్షేత్రంలోనికి దించింది. ఆయ‌న అధికారికంగా ఈ విష‌యం దృవీక‌రించ‌న‌ప్ప‌టికీ.. ఇది బ‌హిరంగ ర‌హస్య‌మే. ఇంక చంద్ర‌బాబునాయుడు అధికారంలోనికి రావ‌డానికి.. గ‌త ఎన్నిక‌ల‌కు ముందే కాపుల‌కు రిజ‌ర్వేష‌న్ల‌ను క‌ల్పిస్తామ‌ని హామి ఇచ్చారు. అందుకే.. గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు సంపూర్ణ మ‌ద్ద‌తును కాపులు ప్ర‌క‌టించారు. అందుకే కాపుల ఆధిప‌త్యం ఉన్న‌ తూర్పు, ప‌శ్చిమ గోదావరిలో 34 ఎమ్మెల్యే సీట్లుండ‌గా.. వాటిలో 27 తెలుగుదేశం పార్టీ గెలుచుకుని.. అధికారాన్ని ఏర్పాటు చేసుకుంది. వైఎస్ఆర్ సీపీ అధినేత జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి.. కూడా నిన్న మొన్న‌టి వ‌ర‌కూ కాపుల ప‌క్ష‌పాతిగానే త‌న‌ను తాను చెప్పుకుంటూ వ‌చ్చారు. కానీ.. తాజాగా కాపు రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో జ‌గ‌న్ మాట్లాడిన ఓ మాట‌.. రాష్ర్టంలో కాపులను ఆగ్ర‌హానికి గురిచేసింది. వాస్త‌వ ప‌రిస్థితి ఎలా ఉంటే.. దాని ప్ర‌కార‌మే జ‌రుగుతుందంటూ అర్థ‌మొచ్చేలా జ‌గ‌న్ కాపు రిజ‌ర్వేష‌న్ల గురించి అన‌డం.. ప్ర‌తిప‌క్షాలు దానిని గ‌ట్టిగా త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవ‌డంతో.. జ‌గ‌న్ ఎన్నిక‌ల‌కు ముందు సెల్ఫ్‌గోల్ వేసుకున్న‌ట్టు అనిపించింది. దీనిని మ‌రింత బాగా వినియోగించుకునేందుకు తెలుగుదేశం పార్టీ పావులు క‌దుపుతోందిప్పుడు. కాపు రిజ‌ర్వేష‌న్ల‌కు సంబంధించి గ‌ట్టిగా పోరాడాల‌ని.. చంద్ర‌బాబునాయుడు త‌న శ్రేణుల‌కు ఆదేశించారు. షెడ్యూల్ 9లో కాపు కోటాను చేర్చేలా ఢిల్లీ వేదిక‌గా పోరాడాల‌ని త‌న ఎంపీల‌కు సూచించారు. జ‌గ‌న్ వైఖ‌రిని ఎండ‌గ‌ట్టాల‌ని సైతం త‌న పార్టీ శ్రేణుల‌కు సూచించారు.

2019 ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రాజ‌కీయ ఆరంగేట్రం త‌ర్వాత‌.. తొలిసారి ప్ర‌జాక్షేత్రంలోనికి వ‌స్తుండ‌డంతో కాపుల‌కు ప్రాధాన్యం పెరిగింది. రాష్ర్టంలో కాపు, క‌మ్మ‌, రెడ్డి.. ఈ మూడు ప్ర‌ధాన సామాజిక వ‌ర్గాలు. వీరిలో కాపుల జ‌నాభానే ఎక్కువ‌. రాష్ర్టంలో 15.2శాతం కాపు జ‌నాభా ఉంది. రెడ్డి సామాజిక వ‌ర్గం 6.5శాతం, క‌మ్మ సామాజిక వ‌ర్గం 4.8శాతం ఉన్నారు. కానీ.. ఆది నుంచి కాపుల కంటే.. రెడ్డి, క‌మ్మ వ‌ర్గాల ఆధిప‌త్య‌మే రాష్ర్టంలో కొన‌సాగుతోంది. అయితే.. కాపుల మ‌ద్ద‌తుతో ఆ రెండు సామాజిక వ‌ర్గాల‌కు చెందిన నేత‌లు ముఖ్య‌మంత్రులుగా, పార్టీల అధినేత‌లుగా ఉంటూ వ‌స్తున్నారు. కాపు సామాజిక వ‌ర్గానికి సంబంధించి ఓ ప్ర‌త్యేక పార్టీ లేక‌పోవ‌డంతో ఎవ‌రికో ఒక‌రికి వీళ్లు కొమ్ముకాస్తూ వ‌స్తున్నారు. ఎప్పుడైతే.. 2009లో చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీని ఏర్పాటు చేశారో.. అప్పుడు కాపులంతా గంప‌గుత్తుగా ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చేశారు. అందుకే చిరంజీవి పార్టీకి ఏకంగా.. 16.22శాతం ఓట్లు వ‌చ్చాయి. ఇప్పుడు అదే కోవ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీని పెట్టి.. బ‌హిరంగ ఎన్నిక‌ల్లోనికి వ‌చ్చారు. ఇప్పుడు కాపులు ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. కానీ.. కాపుల ఓట్లు లేకుంటే ఈసారి అధికారం చేప‌ట్ట‌డం మిగ‌తా తెలుగుదేశం, వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీల‌కు అసాధ్యం. అందుకే.. ఎలాగైనా వారిని త‌మ‌వైపు తిప్పుకోవాల‌ని.. ఏమాత్రం వారి విష‌యంలో తొంద‌ర‌పాటు ప్ర‌క‌ట‌న‌లు, చ‌ర్య‌ల‌కు దిగ‌కుండా.. వెళుతున్నారు. తాజాగా జ‌గ‌న్ కూడా తానో నిజాయ‌తీప‌రుడిన‌నే కోణంలో ప్రొజెక్ట్ చేసుకునేందుకు చేసిన ప్ర‌క‌ట‌న‌.. రివ‌ర్స‌యిపోయి.. వ‌చ్చి గుచ్చుకుంటుంద‌ని ఊహించ‌లేదు. తాను మాట ఇస్తే.. ఖ‌చ్చితంగా చేసి తీరుతాన‌ని, అందుకే.. వాస్త‌వాల‌నే చెబుతాన‌నే యాంగిల్‌లో మాట్లాడి.. అడ్డంగా బుక్క‌య్యాడు. చిట్ట‌చివ‌రి కాపు ఉద్య‌మ నేత‌గా కొన‌సాగుతున్న ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభంలాంటి వాళ్లు సైతం జ‌గ‌న్‌ను బ‌హిరంగంగానే విమ‌ర్శించారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కూ వీళ్లంతా చంద్ర‌బాబును తిడుతూ.. జ‌గ‌న్‌కు కొమ్ముకాశారు. ఈ ప‌రిణామాల‌న్నింటి నేప‌థ్యంలో ఎలా చూసినా.. రెడ్డి వ‌ర్గం జ‌గ‌న్‌కు, క‌మ్మ వ‌ర్గం చంద్ర‌బాబు పార్టీల‌కు బాస‌టా నిలుస్తాయి. ఎటొచ్చీ ఈ రెండు సామాజిక వ‌ర్గాలు క‌లిపినా.. లేనంత‌ ఓటుబ్యాంకు ఉన్న కాపులే.. కింగ్‌మేక‌ర్లు. ప‌వ‌న్ రాక‌తో ప‌రిణామాలు ఎటునుంచి ఎటైనా మ‌ళ్లేందుకు అవ‌కాశం ఉంది. అందుకే..2019 ఎన్నిక‌ల్లో కాపుల‌కు ఇంత ప్రాధాన్యం పెరిగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -