Saturday, May 18, 2024
- Advertisement -

తెలంగాణ బరిలో వైఎస్ఆర్ సీపీ లేనట్టే

- Advertisement -

వైఎస్ఆర్ సీపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండాలని భావిస్తోంది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలంగాణ బరిలో దిగకూడదనే ఆ పార్టీ నిర్ణయం ఉండబోతోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలోని 92 స్థానాల్లో పోటీ చేసిన వైఎస్ఆర్సీపీ కేవలం 3 స్థానాల్లో విజయం సాధించింది. అవి కూడా ఏపీ సరిహద్దు జిల్లా అయిన ఖమ్మం జిల్లాలోనే. ఈ మూడు ఎమ్మెల్యే స్థానాలతో పాటు ఖమ్మం ఎంపీగా ఆ పార్టీ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలుపొందారు. కానీ తర్వాత కేసీఆర్ ఆకర్ష్ పథకానికి ఆ ఎమ్మెల్యేలు, ఎంపీ కూడా ఆకర్షితులైపోయారు. ఎన్నికల్లో ఎంత గట్టిగా పోరాడారో అంతే వేగంగా ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. దీంతో టీడీపీ జగన్ ను పదే పదే ఏపీలో ఇరకాటంలో పెట్టడానికి ఆ ఫిరాయింపు అస్త్రాన్ని వాడుకుంటోంది. ఏపీలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనేశారు. మా పార్టీ ఎమ్మెల్యేలు అమ్ముడు పోయారు అని వైెస్ఆర్ సీపీ విమర్శించిన ప్రతిసారి టీడీపీ నేతలు మరి తెలంగాణలో, నీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీ ఎంతకు కేసీఆర్ కు అమ్ముడుపోయారో చెప్పాలంటూ జగన్ పై దాడి చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యేను కొంటే ఇంకో ఎమ్మెల్యే ఫ్రీ అన్నట్టు జగన్ కావాలనే తన పార్టీ తెలంగాణ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ గూటిలో చేర్చేశారని విమర్శలు పెరిగిపోయాయి. ఏపీ విభజనకు కారణమైన టీఆర్ఎస్ తో స్నేహసంబంధాలు నెరుపుతూ, తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీను ఆ పార్టీలో చేర్చేసిన జగన్, ఏపీ సీఎం అయితే ఇంకా ఏమైనా ఉందా ? అంటూ ఏపీ ప్రజల మధ్య ఆయనను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ సీపీ పోటీ చేసినా పెద్దగా సాధించేది ఏమీ ఉండదు. ఆ ప్రాంతంలో వైఎస్ఆర్ అభిమానులు భారీగానే ఉన్నారు. కానీ వైఎస్ఆర్ సీపీ మాత్రం వారి అభిమానాన్ని ఓట్లుగా మార్చుకునే ప్రయత్నాలు ఎందుకో చేయట్లేదు. గతంలో జగన్ ఓదార్పుయాత్ర కోసం వరంగల్ వెళ్లినప్పుడు టీఆర్ఎస్ వెర్సస్ వైఎస్ఆర్ సీపీ యుద్ధం గట్టిగానే సాగింది. రైల్వే స్టేషన్లో రాళ్లదాడితో కొండా సురేఖ వర్గం టీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడింది. ఆ సంఘటనలోనే సురేఖ కేసీఆర్, హరీశ్ రావుని బూతులు తిట్టింది. బహిరంగంగా మీడియా సాక్షిగా పోయిజన్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. కొండా సురేఖ తెలంగాణ కోసం ఎంత పోరాడిందో..? తెలియదు కానీ వైఎస్ఆర్ సీపీ కోసం మాత్రం నాడు ప్రాణాలు ఫణంగా పెట్టి మరీ పోరాటం చేసింది.

అయితే అంత బలమైన నాయకులు వైఎస్ఆర్సీపీకి అప్పట్లో తెలంగాణలో ఉండేవారు. కానీ ఎందుకో ఆ తర్వాత జగన్ వారిని పూర్తిగా పక్కన పెట్టేశారు. దీంతో కొండా సురేఖ దంపతులతో పాటు ఇతర నాయకులు మెల్లగా ఇతర పార్టీలవైపు వెళ్లిపోయారు. వైఎస్ఆర్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ సైతం తప్పని పరిస్థితుల్లో వేరే పార్టీలకు ఓట్లు వేయాల్సి వస్తోంది. దీనికంతటికి కారణం తెలంగాణపై జగన్ పూర్తిగా చేతులెత్తేయడమే. ఒకదశలో ఆయన సోదరి షర్మిళకు తెలంగాణ బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ రావడం, ఆ దిశగా ఆలోచనలు జరపడం చేశారు. కానీ ఎందుకో అది కూడా ఆలోచనలకే పరిమితం అయింది. ఇప్పుడు మళ్లీ తెలంగాణలో పోటీ చేసి, గట్టిగా కేసీఆర్ పై, పోరాడలేక, ఉండలేక దాని ప్రభావాన్ని ఏపీలో ఎందుకు చూపించుకోవడం అనే ధోరణిలో వైఎస్ఆర్ సీపీ నాయకత్వ ఉంది. ఒక వేళ పోటీ చేసిన నాలుగైదు స్థానాలు గెలిచినా వాళ్లు కూడా పార్టీలో ఉంటారనే నమ్మకం లేదు. ఎన్నికల తర్వాత వెంటనే మళ్లీ ఏదో పార్టీలో చేరిపోవడం ఖాయం అని అనుమానిస్తున్నారు. దీంతో పోటీయే అనవసరం అనే దిశగా వైఎస్ఆర్ సీపీ భావిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -