Tuesday, May 14, 2024
- Advertisement -

2019లో జగనే సీఎం, అందుకే పీకే గుడ్ బై !

- Advertisement -

వైఎస్ఆర్ సీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తాజా ఇంటర్వ్యూ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాల్లో సంచలనమయింది. ముఖ్యంగా వైఎస్ఆర్ సీపీలో కలకలం రేపుతోంది. వైఎస్ జగన్ ను విజయతీరాలకు చేరుస్తాడనే నమ్మకంతో ఉన్న ఆ పార్టీ శ్రేణులు పీకే తాజా ఇంటర్వ్యూ చూశాక షాక్ కి గురయ్యారు. అసలేం జరిగింది ? ఎందుకు పీకే వైఎస్ఆర్ సీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు ? అంటూ ఆరాలు తీయడం మొదలు పెట్టారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొన్న ప్రశాంత్ కిశోర్, టెలిగ్రాఫ్ ఎడిటర్, సీనియర్ జర్నలిస్ట్ సంకర్షన్ ఠాకూర్ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పి, ఏపీ రాజకీయాల్లో కలకలం రేపారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తాను ఏ పార్టీ తరఫున పని చేయనని పీకే చెప్పారు. బీహార్ లోని తన స్వగ్రామంలోని మూలాల్లోకి వెళ్లిపోతానన్నారు. లేదంటే తాను తొలిసారి ఎన్నికల కోసం పని చేసిన గుజరాత్ వెళ్లి, క్షేత్రస్థాయి నుంచి పని చేస్తానని తెలిపారు. జగన్ పార్టీకి సేవలందించినందుకు 4 నుంచి 5వందల కోట్లు అందుకున్నారనే ప్రచారాన్ని కొట్టి పారేశారు. అలాంటిదేం లేదన్నారు. తాను రాజకీయాల్లో నేరుగా పోటీ చేయట్లేదని తేల్చి చెప్పారు. అయితే ఇప్పటికే ఆయన స్థాపించిన ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ ( ఐ ప్యాక్) బాధ్యతలను సమర్ధవంతమైన వ్యక్తుల చేతిలో పెట్టేసి, తాను వేరే భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు.

2019 ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున పని చేయనని పీకే చెప్పడంతో, ఇక వైఎస్ఆర్ సీపీ రాజకీయ వ్యూహకర్త పదవికి గుడ్ బై చెప్పేసినట్టేనని తేలిపోయింది. అలా చెప్పడంతో వైఎస్ఆర్ సీపీ శ్రేణులు కలవరపడుతున్నాయి. జగన్ తో ఏమైనా తేడాలొచ్చాయా ? తమ లక్ష్యం నెరవేరకముందే పీకే వెళ్లిపోతాడా ? ఇక 2019లో వైఎస్ఆర్ సీపీ గెలుస్తుందా ? లేదా ? పీకే మార్కు వ్యూహాలతో విజయం అందుకోలేమా ? ఇలా అనేక అనుమానాలతో వైఎస్ జగన్ అభిమానులు తలలు బాదుకుంటున్నారు. కానీ వాస్తవానికి ప్రశాంత్ కిశోర్ లక్ష్యాన్ని ఇప్పటికే చేరుకున్నారు. వచ్చే మార్చ్, ఏప్రిల్, మే నెలల్లో ఎప్పుడైనా ఎన్నికలు జరిగినా, అందుకు తగ్గట్టు ఇప్పటికే వ్యూహాలు సెట్ చేసేశారు. పాదయాత్రలో జగన్ చేస్తున్న ప్రసంగాలు, హామీలు అన్నీ పీకే స్క్రిప్ట్ ప్రకారం జరుగుతున్నవే. ఎప్పుడైతే పీకే వైఎస్ఆర్ సీపీ రాజకీయ వ్యూహకర్త బాధ్యతలు చేపట్టారో అప్పుడే ఆయన టీం రంగంలోకి దిగిపోయింది. నియోజకవర్గాల వారీగా క్షేత్రస్థాయిలోకి తమ సిబ్బందిని పీకే పంపేశారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్ధుల బలాబలాలతో పాటు ప్రత్యర్ధి పార్టీలో ఎవరు దిగితే, ఎవరి స్థాయి, శక్తిసామర్ధ్యాలు ఎంతమేర పని చేస్తాయో ఇప్పటికే ఓ అంచనాకు వచ్చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ కో ఆర్డినేటర్ల మార్పులు చేర్పులు, ఎమ్మెల్యే అభ్యర్థుల ప్లస్, మైనస్ పాయింట్లతో సమగ్ర నివేదిక తయారు చేసి జగన్ కు అందజేశారు.

తన స్పెషల్ టీం జగన్ పాదయాత్రలో కలిసిపోయి, జనం నాడి పట్టుకునే ప్రయత్నాల్లో మునిగిపోయింది. ప్రాంతాలు, నియోజకవర్గాల వారీగా స్థానిక సమస్యలు, పరిష్కారాలు, వాటిపై జనం ఏం కోరుకుంటున్నారు ? జగన్ నుంచి ఏమి ఆశిస్తున్నారు ? జగన్ స్పీచులపై జనం ఎలా స్పందిస్తున్నారు ? ఎలాంటి హామీలు, ప్రకటనలు చేసినప్పుడు బాగా సానుకూలంగా స్పందిస్తున్నారు ? ఏ అంశాలపై మాట్లాడినప్పుడు నెగిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు ? జగన్ స్పీచుల్లో ఎలాంటి మార్పులుండాలి ? ఎలాంటి హామీలు ఇవ్వాలి ? ఇలా సమగ్ర నివేదిక అందజేశారు. ప్రజల నాడి తెలుసుకుని, నియోజకవర్గాల వారీగా స్థానిక సమస్యలపై ఫోకస్ పెట్టి, వాటి పరిష్కారానికి జగన్ ఏం చేస్తారో ? ఎలా పరిష్కరిస్తారో ? ఆయన నోటి వెంటే చెప్పించి ప్రశాంత్ కిశోర్ టీం సక్సెస్ సాధించింది. జగన్ కు స్వతహాగా ఉన్న మాస్ ఫాలోయింగ్ కు, పీకే టీం కృషి ఫలితం తోడవ్వడంతోనే గతంలో కంటే ఎక్కువగా ఈ సారి పాదయాత్రలో విశేష స్పందన లభిస్తోంది. జగన్ కు వస్తున్న ఆదరణ, జన ప్రభంజనం చూస్తుంటే 2019లో ఆయనే అధికారం చేపట్టే అవకాశాలున్నాయనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. అందుకే తన లక్ష్యం నెరవేరినట్టు అనిపించడంతోనే.. ఇక 2019 ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున పని చేయను అని పీకే చెప్పారు. అయినా మరో రెండు, మూడు నెలల వరకూ అంటే దాదాపు ఎన్నికల సమయం వరకూ ఆయన సేవలందించడం ఖాయం. అప్పటి పరిస్థితులను బట్టి మళ్లీ వ్యూహరచన చేశాకే, తన బాధ్యతల నుంచి పూర్తిస్థాయిలో తప్పుకుంటారు. బీహార్ వెళ్లిపోయినా తెరవెనుక నుంచి ఎన్నికలు పూర్తయ్యేవరకూ తన సలహాలు, సూచనలు ఇవ్వక మానరు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -