Monday, May 20, 2024
- Advertisement -

దిద్దుబాటు చర్యల్లో వైఎస్ఆర్ సీపీ నేతలు..

- Advertisement -

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు, భార్యలపై వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యపై పవన్ సామాజికవర్గమైన కాపులు కొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాకు కులం లేదు. మతం లేదు. అంతా ఒక్కటే అని పవన్ పలుమార్లు చెప్పుకున్నా, ఆయన సామాజికవర్గం మాత్రం పవన్ మావాడే. మా కులపోడే…అని గొప్పగా చెప్పుకుంటోంది. ఈ నేపథ్యంలో జగన్ తాజాగా ఆయన పెళ్లిళ్లు, భార్యలపై ఘాటైన విమర్శలు చేయడంతో కాపులు మండిపడుతున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలోని కొందరు కాపులు రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలోని ప్రజాసంకల్పయాత్రలో ఉన్న జగన్ తన షెడ్యూల్ మార్చుకున్నారు. తూగో జిల్లాకు చెందిన వైఎస్ఆర్ సీపీలోని కొందరు కాపు నేతలు జగన్ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. మీరు చేసిన కామెంట్స్ సరైనవే అయినా, స్థానికంగా కాపు సామాజికవర్గం నాయకులమైన మాకు, పవన్ అభిమానులు, కాపు ఓటర్ల నుంచి కొంత ఇబ్బందులు తప్పవు. ఎటూ కాపులు అధికంగా ఉన్న తూగో జిల్లాలోనే ఉన్నారు, కనుక కాస్తా దిద్దుబాటు చర్యలు చేసుకుందాం. కాపుల రిజర్వేషన్లపై హామీ ఇచ్చి, వారిని బుజ్జగించే పని చేద్దాం.. అని చెప్పుకోవడంతో జగన్ కూడా అంగీకరించారు. అందుకే ఆయన పాదయాత్ర షెడ్యూల్ ముందు నిర్ణయించినట్లు కాకుండా సడెన్ గా మారింది.

ప్రస్తుతం పెద్దాపురం నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న జగన్ ముందస్తు షెడ్యూల్ ప్రకారం తర్వాత పిఠాపురం వెళ్లాల్సి ఉంది. కానీ షెడ్యూల్ మార్చి రూట్ మ్యాప్ లో లేని జగ్గంపేటకు శనివారం వెళ్లేలా నిర్ణయించారు. ఆ నియోజకవర్గంలో జగన్ మూడు రోజులు ఉండేలా ప్లాన్ చేశారు. జగ్గంపేట నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో రేపు శనివారం జగ్గంపేటలోని నేషనల్ హైవే పక్కనున్న బాలాజీనగర్ లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఆ సభ సక్సెస్ చేయడానికి దాదాపు కోటి రూపాయలు వరకూ ఖర్చు అయ్యే అవకాశముందని తెలుస్తోంది. అంత ఖర్చు అంటే…ఎంత భారీ స్థాయిలో నిర్వహణకు సిద్ధమవుతున్నారో అర్ధం చేసుకోవచ్చు.

వాస్తవానికి షెడ్యూల్ లేకపోయినా తమ నియోజకవర్గంలోకి రావాలని ఇప్పటికే మూడుసార్లు జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ కో ఆర్డినేటర్ జ్యోతుల చంటిబాబు జగన్ ను కోరారు. పాదయాత్ర తర్వాత బస్సు యాత్ర ద్వారా వస్తానని చెప్పిన జగన్, తర్వాత మనసు మార్చుకున్నారు. పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యలపై కాపులు అసంతృప్తితో ఉన్నారనే సమాచారంతో జగన్ షెడ్యూల్ మార్చుకున్నారు. కాపులు అధికంగా ఉండే జగ్గంపేట నియోజకవర్గంలో ఇదే ఊపులో, ఇదే వేడిలో పర్యటించి వారిని చల్లార్చాలనే ప్రయత్నాలు ప్రారంభించారు. కాపుల రిజర్వేషన్లపై కూడా గతంలో జగ్గంపేట కేంద్రంగా పెద్ద ఉద్యమమే నడిచింది. దీంతో ఇదే సమయంలో కాపులను మంచి చేసుకుని, వారి రిజర్వేషన్లపై బహిరంగ సభలో స్పష్టమైన హామీ ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నారు. శనివారం బహిరంగ సభ అనంతరం 29న ఆదివారం రాష్ట్ర స్థాయి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్లతో సమావేశం కుాడ నిర్వహించనున్నారు. ఆ సమావేశంలోనే ఎన్నికల ప్రణాళిక రచించనున్నారు. ఆ మరుసటి రోజు కూడా జగ్గం పేట నియోజకవర్గంలోనే జగన్ పాదయాత్ర కొనసాగుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -