ఆడుదాం ఆంధ్రా ఆటల పండుగ ఇవాళ ఏపీ వ్యాప్తంగా ప్రారంభం కానుంది. ఈ ఆటల పోటీల్లో భాగంగా 47 రోజుల పాటు అన్ని వార్డులు, గ్రామ సచివాలయ పరిధిలో క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, ఖో ఖో, బ్యాడ్మింటన్ పోటీలను నిర్వహించనున్నారు. ఇక మండల స్ధాయిలో 2024 జనవరి 10 నుం డి,నియోజకవర్గాల స్ధాయిలో జనవరి 24 నుండి ఆటల పోటీలు జరగనున్నాయి. ఆ తర్వాత 2024 ఫిబ్రవరి 10 వరకు రాష్ట్ర స్ధాయి పోటీలు జరగనున్నాయి.
గెలుపొందిన విజేతలకు వివిధ స్థాయిల్లో నగదు ప్రోత్సహకాలు అందించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. గుంటూరులో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం జగన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనూ ఇలా పెద్ద ఎత్తున ఆటల పోటీలను నిర్వహించిన సందర్భాలు లేవు.
క్రీడల పోటీల్లో గెలుపొందిన విజేతలకు నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నగదు బహుమతులు అందించనున్నారు. ఒక్కో ఆటలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇవ్వనున్నారు. క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ గేమ్స్‌లో రాష్ట్రస్ధాయిలో విజేతలకు ఫస్ట్ ప్రైజ్ 5లక్షలు, జిల్లా స్ధాయిలో 60వేలు, నియోజవర్గ స్ధాయిలో 35వేలు నగదు బహుమతి ఇవ్వనున్నారు. ద్వితీయ బహుమతి కింద రాష్ట్ర స్ధాయిలో 3 లక్షలు, జిల్లా స్ధాయిలో 30 వేలు, నియోజకవర్గస్ధాయిలో 15వేలు, తృతీయ బహుమతి కింద రాష్ట్రస్ధాయిలో 2లక్షలు, జిల్లా స్దాయిలో 10వేలు, నియోజకవర్గ స్ధాయిలో 5వేలు ఇవ్వనున్నారు. ఇప్పటికే ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహించింది.యువత నుండి మంచి స్పందన రావడంతో ఆడుదాం ఆంధ్రా విజయవంతమవుతుందని అధికారులు చెబుతున్నారు.
