ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నియామకాలు వివాదాస్పదమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో డీఎస్సీ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలోనూ స్పోర్ట్స్ కోటా బండారం బయటపడింది. పెద్ద అప్పలరాజు అనే వ్యక్తికి ఉద్యోగం రాగా, పాండ అప్పలరాజు పేరుతో ఉన్న సర్టిఫికెట్ అప్లోడ్ చేశారు. తమ్ముడి సర్టిఫికెట్ ఎందుకు అప్లోడ్ చేశారు? మూడు సార్లు సర్టిఫికెట్లు ఎందుకు మార్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. నకిలీ బ్లైండ్ సర్టిఫికెట్తో ఓ వ్యక్తి ఉద్యోగం పొందాడని మహిళా అభ్యర్థి ఆరోపిస్తున్నారు. స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల జాబితా ఇవ్వాలని కోరితే డీఈవో నిరాకరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే జాబితా ఇవ్వలేమని, లిఖితపూర్వకంగా కోరితే ఆర్జేడీకి పంపుతామని తెలపడం విమర్శలకు తావిస్తోంది.
కోనసీమ జిల్లాలో అడ్డగోలుగా పోస్టింగ్‌లు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. బీఈడీ సర్టిఫికెట్లు సమర్పించకపోయినా, రిమార్క్స్‌లో ‘నాట్ క్వాలిఫైడ్’ అని ఉన్నప్పటికీ బాక్సింగ్ స్పోర్ట్స్ కోటాలో గాయత్రి సాయిశ్రీకి సోషల్ స్కూల్ అసిస్టెంట్ పోస్టింగ్ ఇచ్చారు. తెలుగు పండిట్‌కు సోషల్ పోస్టింగ్ ఎలా ఇచ్చారనేదానిపై అధికారుల నుంచి స్పష్టత లేదు. వైఎస్సార్ జిల్లాలోనూ రిజర్వేషన్ల మార్పులో గోల్మాల్ బయటపడింది. బీసీ-ఈ అభ్యర్థి మనూర్ రసూల్.. ఓసీ (ఈడబ్ల్యూఎస్) కింద దరఖాస్తు చేసి ఉద్యోగం పొందారు. ఈ అక్రమాల వల్ల తనకు ఉద్యోగం రాలేదని రాయచోటికి చెందిన జమీల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కర్నూలు జిల్లాలో వెలుగు చూసిన అక్రమాలను కప్పిపుచ్చేందుకు విద్యాశాఖ ప్రయత్నిస్తోందని విమర్శలున్నాయి. క్రీడా కోటా కింద ఎంపికైన ఈడిగ ప్రభాకర్ నియామకంపై వివరణ ఇచ్చిన విద్యాశాఖ.. సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపింది. డీఎస్సీ ప్రక్రియ అంతా పారదర్శకంగా జరిగిందని పునరుద్ఘాటిస్తోంది. అయితే వరుసగా బయటపడుతున్న ఈ అక్రమాలు ప్రభుత్వ సమర్థతపై తీవ్ర నీలి నీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి.
