వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఎవరికి అంతు చిక్కడం లేదు. పెద్ద ఎత్తున సిట్టింగ్‌లను మారుస్తు ఎక్కడా అసంతృప్తి రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు 50 అసెంబ్లీ, 9 ఎంపీ స్థానాల్లో మార్పులు, చేర్పులు చేశారు జగన్. రానున్న రోజుల్లో మరిన్ని మార్పులు ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోండగా వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది.
అయితే ఈ క్రమంలో వైసీపీలో ఓ న్యూస్ చర్చనీయాంశంగా మారింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఛాన్స్ దక్కించుకోవడం. ఇంతకీ ఎవరా ఫ్యామిలీ అనుకుంటున్నారా? అదే ఆదిమూలపు సురేష్ ఫ్యామిలీ. సీఎం జగన్ దగ్గర తన ప్రాధాన్యతను నిరూపించుకున్నారు సురేష్.
ప్రస్తుతం జగన్ కేబినెట్‌లో మున్సిపల్,పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న సురేష్…2009లో ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నుండి గెలుపొందారు. తర్వాత 2014లో సంతనూతలపాడు నుండి బరిలో దిగి విజయం సాధించగా 2019లో తిరిగి యర్రగొండపాలెం నుండి గెలుపొందారు. ఇక ఈ సారి కొండెపి నుండి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
సురేష్ సోదరుడు ఆదిమూలపు సతీష్ ను కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం అభ్యర్థిగా ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సుధాకర్ ను తప్పించి సతీష్‌కు సీటు ఇచ్చారు జగన్. అలాగే సురేష్ బావ తిప్పేస్వామి ప్రస్తుతం అనంతపురం జిల్లా మడకశిర ఎమ్మెల్యేగా ఉండగా మరోసారి ఆయనకే అవకాశం ఇవ్వనున్నారు జగన్. ఇలా ఒకే ఫ్యామిలీ నుండి ముగ్గురు టికెట్ దక్కించుకోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
