- Advertisement -

ఢిల్లీ వాయు కాలుష్యంపై సుప్రీం తీవ్ర వ్యాఖ్యలు

- Advertisement -

ఢిల్లీ నగరంలో రోజురోజుకీ క్షీణిస్తున్న వాయు నాణ్యతపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. వాయు కాలుష్య సమస్యకు పరిష్కారాలు సూచించే ముందు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) క్షీణతకు గల ప్రధాన కారణాలను ముందుగా గుర్తించాలని యిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (CAQM) ను ఆదేశించింది. జాతీయ రాజధానిలో వాయు కాలుష్యంపై దాఖలైన పిటిషన్లను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, స్పష్టమైన నిర్ధారణ లేకుండా తీసుకునే చర్యలు ఫలితాలివ్వవని స్పష్టం చేసింది.

CAQM రెండు వారాల్లోపు రంగ నిపుణులను ఎంపిక చేసి సమావేశం ఏర్పాటు చేసి, ఢిల్లీ వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలు ఏవో వీలైనంతవరకు ఏకాభిప్రాయంతో నిర్ణయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వివిధ రంగాలకు చెందిన నిపుణులను “ఒకే వేదికపైకి” తీసుకువచ్చి సమగ్రంగా, డేటా ఆధారంగా అధ్యయనం చేయాల్సిన బాధ్యత CAQMదేనని కోర్టు పేర్కొంది. ఈ అధ్యయన ఫలితాలను ప్రజా డొమైన్‌లో ఉంచాలని కూడా ఆదేశించింది.

సుప్రీంకోర్టు తన పాత్రను వివరిస్తూ, తాము సూపర్ ఎక్స్‌పర్ట్ గా వ్యవహరించబోమని, కానీ నిపుణుల ఆధారిత నిర్ణయాలు సమయానికి, పారదర్శకంగా జరిగేలా చూస్తామని ధర్మాసనం తెలిపింది. మొదటి దశ కారణాలను గుర్తించడం. పరిష్కారాలు తరువాత వస్తాయి అని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

AQI క్షీణతకు కారణాలను గుర్తించడంలోనూ, దీర్ఘకాలిక పరిష్కారాలపై పనిచేయడంలోనూ CAQM “అత్యవసరత చూపడం లేదని” కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి ఆలస్యం ప్రతి ఏడాది తిరిగి ఎదురవుతున్న కాలుష్య సమస్యను మరింత క్లిష్టతరం చేస్తుందని హెచ్చరించింది. ప్రధాన కాలుష్య కారకాలు ఏవో గుర్తించిన తరువాత మాత్రమే దీర్ఘకాలిక చర్యలపై ఆలోచించాలని సూచించింది.

విచారణ సందర్భంగా నిర్మాణ కార్యకలాపాలు, వాహనాల ఉద్గారాలు నిపుణుల స్థాయి పరిశీలన అవసరమైన అంశాలని ధర్మాసనం పేర్కొంది. అయితే సామాజిక అవసరాలనూ గుర్తించింది. ఇళ్ల అవసరం ఉంది, కాబట్టి నిర్మాణాలు కొనసాగుతాయి. కానీ అవే కాలుష్యానికి కారణమైతే ఏమి చేయాలి?” అని ప్రశ్నించింది. వాహనాల వల్ల దాదాపు 40 శాతం కాలుష్యం జరుగుతుందన్న అంచనాలపై కూడా కోర్టు ప్రస్తావిస్తూ, “బస్సులు ఆపేస్తే సామాన్యుడు ఎలా ప్రయాణిస్తాడు?” అని వ్యాఖ్యానించింది.

పంట అవశేషాల దహనం (స్టబుల్ బర్నింగ్) విషయంలో రైతులపై మాత్రమే నిందలు వేయడాన్ని కోర్టు తప్పుబట్టింది. కోవిడ్ కాలంలో స్టబుల్ బర్నింగ్ ఉన్నప్పటికీ ఢిల్లీలో ఆకాశం స్పష్టంగా కనిపించిందని గుర్తుచేసింది. ఇది సమగ్ర, ఆధారాలపై ఆధారపడి చేసిన అధ్యయనం అవసరాన్ని సూచిస్తుందని తెలిపింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -