సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచి కోసం వాడుకోవచ్చు.. కానీ నేరాలకు పాల్పడేందుకు కూడా దీన్ని వాడుకుంటున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో సంచలనం సృష్టించిన త్రిపుర హత్యల కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. తల్లిదండ్రులు, తోబుట్టువులను అత్యంత దారుణంగా కడతేర్చడానికి ఓ ప్రబుద్ధురాలు సెల్‌ఫోన్‌లోని కృత్రిమ మేధ (AI) చాట్‌బాట్ సూచనలు తీసుకున్నట్లు పోలీసులు తేల్చారు.
బెంగళూరు నగర పరిధిలోని సీగేహళ్లి అపార్ట్‌మెంట్‌లో సోమసుందర్ (52), ఆయన భార్య ముత్తులక్ష్మి (48), వారి చిన్న కుమార్తె సుప్రియ (19) హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ సంచలన కేసుకు సంబంధించి పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేయగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఆ ముగ్గురిని సోమసుందర్ పెద్ద కుమార్తె శ్వేత, ఆమె ప్రియుడు కెన్నెత్ కలిసి అత్యంత పథకం ప్రకారమే కడతేర్చినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
ఈ హత్యలకు పాల్పడటానికి కొద్ది రోజుల ముందు నుంచి శ్వేత, కెన్నెత్ కలిసి ఏఐ చాట్‌బాట్‌ను విపరీతంగా వాడారు. ఎవరినైనా ఎటువంటి ఆనవాళ్లు లేకుండా ఎలా హతమార్చాలి? అనే అంశాలపై ఆ చాట్‌బాట్ నుంచి మెలకువలు, సలహాలు తెలుసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దాదాపు ఆరు నెలలుగా వారు ఈ హత్యల కోసం పక్కాగా ప్రణాళికలు రూపొందించుకున్నారని తేలింది. శ్వేత ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తుండటంతో, టెక్నాలజీపై ఉన్న అవగాహనతో ఏఐ సహకారాన్ని పూర్తిగా వాడుకుంది.
ఏఐ చాట్‌బాట్‌లో వారు అడిగిన ప్రశ్నలు, దానికి ఆ టూల్ ఇచ్చిన సమాధానాలు ఏంటో తెలుసుకునేందుకు దర్యాప్తు అధికారులు సంబంధిత ఏఐ టూల్ కంపెనీకి అధికారికంగా లేఖ రాశారు. గత ఆరు నెలలుగా ఆ చాట్‌బాట్ ఇచ్చిన సూచనల ప్రకారమే తాము హత్యకు వ్యూహం పన్నామని నిందితులు కూడా విచారణలో అంగీకరించినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి ఏఐ టూల్ కంపెనీ ఇచ్చే అధికారిక వివరాలను పక్కా డిజిటల్ సాక్ష్యంగా పరిగణిస్తామని కేఆర్‌పురం పోలీసులు వెల్లడించారు. టెక్నాలజీని ఉపయోగించి కుటుంబ సభ్యులనే కడతేర్చిన ఈ దారుణ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
