హైదరాబాద్ శివారు మీర్‌పేటలో అత్యంత సంచలనాత్మక హత్య ఘటన వెలుగుచూసింది. అక్క, అన్నలను హతమార్చాడనే కక్షతో రగిలిపోయిన బావమరిది, రౌడీషీటర్ అయిన తన బావను అతి కిరాతకంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. అంతేకాకుండా, హత్య అనంతరం ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ పెట్టి మరీ హత్యా స్థలాన్ని, పరిసరాలను చూపించిన వైనం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
మీర్‌పేట్ ఇన్‌స్పెక్టర్ శోభన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. జల్‌పల్లికి చెందిన దాసరి సురేందర్ అలియాస్ సూరి (41) ఒక కుట్రపూరిత రౌడీషీటర్. ఇతడిపై 3 హత్య కేసులు, పోక్సో, దొంగతనాలు సహా మొత్తం 45 కేసులున్నాయి. గతేడాది రాచకొండ సీపీ ఈయన్ను నగరం నుంచి బహిష్కరించడంతో వరంగల్‌కు మకాం మార్చాడు. అక్కడ కూడా నేరాలకు పాల్పడటంతో అరెస్ట్ అయ్యి, జైలు నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం ఉప్పల్‌లో రెండో భార్య పూజతో కలిసి ఉంటున్నాడు.
సురేందర్ తొలుత సబా ఫాతిమా అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె తప్పు చేసిందనే అనుమానంతో 2022లో ఆమెను హత్య చేశాడు. ఆ తరువాత ఆమె పెద్ద తమ్ముడు సల్మాన్‌ను కూడా 2024లో హతమార్చాడు. ఇలా తన అక్కను, అన్నను పొట్టనబెట్టుకున్న సురేందర్‌ను కడతేర్చాలని ఫాతిమా చిన్నతమ్ముడు అర్ఫాజ్ (24) నిర్ణయించుకున్నాడు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా సురేందర్‌తో స్నేహం చేస్తున్నట్లు నటించాడు.
సోమవారం రాత్రి నందనవనం గణేష్‌నగర్‌లో సురేందర్ రెండో భార్య పూజ అన్న గోవిందు పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ వేడుకకు మరో ముగ్గురితో కలిసి వచ్చిన అర్ఫాజ్, గోవిందుకు కేకు తినిపించి అందరితో పాటు కలియతిరిగాడు. అందరూ ఏమరపాటుగా ఉన్న సమయంలో సురేందర్ ముఖంపై పెప్పర్ స్ప్రే చల్లాడు. అతడు తేరుకునేలోగానే కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. సురేందర్ ప్రాణభయంతో పారిపోయేందుకు యత్నించినా, అర్ఫాజ్ అరకిలోమీటరు వరకు వెంటపడి మరీ కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు.
ఈ హత్య చేసిన అనంతరం అర్ఫాజ్ ఏమాత్రం భయం లేకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ చేశాడు. ‘‘కైసా హై భాయ్.. ఎట్లుంది నా ఆట’’ అంటూ నవ్వుతూ తాను సురేందర్‌ను హత్య చేసిన విషయాన్ని, ఆ పరిసరాలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. సుమారు 4 నిమిషాల పాటు సాగిన ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. వేరే రాష్ట్రానికి పారిపోయేందుకు యత్నించిన నిందితుడు అర్ఫాజ్‌తో పాటు మరో ముగ్గురిని మంగళవారం రాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అర్ఫాజ్‌తో వచ్చిన మిగతా ఇద్దరు యువకులకు హత్య పథకం గురించి ముందే తెలియదని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు సమాచారం.
