- Advertisement -

హనీమూన్ హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

- Advertisement -

సమాజంలో వస్తోన్న వేగవంతమైన మార్పుల కారణంగానే ఈ మధ్యకాలంలో ‘హనీమూన్‌ హత్య’ లాంటి దారుణ కేసులు వెలుగుచూస్తున్నాయని సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నేటి తరానికి జ్ఞానం పెరుగుతున్నప్పటికీ, జీవితంలో ఎదురయ్యే మానసిక ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదని పేర్కొంది. ఈ తరం వారు మరింత భావోద్వేగ బలహీనంగా మారుతున్నారని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. సంచలనం సృష్టించిన సోనమ్‌ రఘువంశీ బెయిల్‌ రద్దు వ్యవహారంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది.

హనీమూన్‌ సమయంలో భర్త రాజా రఘువంశీని హత్య చేసిన కేసులో నిందితురాలిగా ఉన్న సోనమ్‌కు సుప్రీంకోర్టు గురువారం బెయిల్‌ రద్దు చేసింది. ఆమె రాబోయే మూడు వారాల్లోగా పోలీసులకు లొంగిపోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్‌ ఎం.ఎం. సుందరేశ్‌, జస్టిస్‌ పీబీ వరాలె ధర్మాసనం సమాజంలోని ప్రస్తుత పరిస్థితులపై లోతైన విశ్లేషణ చేసింది. ‘‘మారుతున్న సమాజంలో ఇలాంటి భయానక సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. నేటి తరానికి ఓపిక చాలా తక్కువ, చికాకు ఎక్కువైపోయింది. వారు ప్రతి సమస్యకూ తక్షణ పరిష్కారాలను కోరుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో అందుబాటులో ఉన్న సమాచారాన్ని గుడ్డిగా నమ్మి దాన్నే నిజమైన జ్ఞానంగా భ్రమిస్తున్నారు’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఈ సందర్భంగా మేఘాలయ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా స్పందిస్తూ.. నేటి కాలంలో హనీమూన్‌కు వెళ్తున్న నవదంపతులు భయంతో బాడీగార్డులను వెంట తీసుకెళ్లే పరిస్థితి వచ్చిందని, భార్యాభర్తల మధ్య నమ్మకం క్రమంగా క్షీణిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఇలాంటి మానసిక సమస్యలను, వివాదాలను ఎంతో మెరుగ్గా పరిష్కరించేదని గుర్తుచేశారు.

మెహతా వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవించిన ధర్మాసనం.. ఉమ్మడి కుటుంబాల ప్రాముఖ్యతను గుర్తుచేసింది. ఉమ్మడి కుటుంబంలో పెరిగిన పిల్లలు పెద్దవాళ్ల ప్రవర్తనను చూసి పరిస్థితులకు తగినట్లు సర్దుకుపోయే తత్త్వాన్ని, ఓర్పును నేర్చుకుంటారని తెలిపింది. నిరాశను, ఎదురుదెబ్బలను ఎలా జయించాలో వారికి అనుభవం ద్వారా తెలుస్తుందన్నారు. కానీ, నేడు ఎక్కువగా చిన్న కుటుంబాలే ఉంటున్నాయని, అలాంటి వాతావరణంలో పెరిగిన వారు చిన్నచిన్న విషయాలకే తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు ఏడిస్తే వారికి సర్దిచెప్పడానికి బదులు చేతిలో మొబైల్ గ్యాడ్జెట్లు పెట్టి మచ్చిక చేస్తున్నారని, భావోద్వేగాలను నియంత్రించాల్సిన వయసులోనే వాటికి బానిసలుగా మారుస్తున్నారని సుప్రీంకోర్టు తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -