పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) – బీసీసీఐ మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయన్న ఆశలు దాదాపు అంతరించిపోయాయి. పాకిస్థాన్ ప్రధాని స్వయంగా ఇండియాతో టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌ను బహిష్కరించే నిర్ణయం కొనసాగుతుందని ప్రకటించడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది.
బంగ్లాదేశ్‌కు సంఘీభావంగా, నిరసనగా కొలంబోలో జరగాల్సిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో భారత్‌తో ఆడబోమని పాకిస్థాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఐసీసీ ఎలా స్పందిస్తుందన్న దానిపై దృష్టి కేంద్రీకృతమైంది. పీసీబీపై ఆంక్షలు విధించే అవకాశం ఉండటంతో, ఆ బోర్డు వాణిజ్య పరంగా తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఐసీసీ కఠిన చర్యలకు సిద్ధమవుతుండటంతో, ఇరు పక్షాల మధ్య పిల్లి–ఎలుక ఆటలా పరిస్థితి మారింది.
ప్రస్తుతం భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌కు ఫిబ్రవరి 15 తేదీగా నిర్ణయించారు. ఆ రోజు నిజంగా మ్యాచ్ జరుగుతుందా లేదా అన్నది సందిగ్దంగానే ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్‌తో మ్యాచ్ గురించి స్పందించారు. మా మైండ్‌సెట్ స్పష్టంగా ఉంది. మేము ఆడమని ఎప్పుడూ చెప్పలేదు. వాళ్లే ఆడమని చెప్పారు. ఐసీసీ ఫిక్చర్ ఇచ్చింది, ప్రభుత్వం న్యూట్రల్ వేదికను నిర్ణయించింది. కొలంబోకు మా ఫ్లైట్ బుక్ అయింది, మేము వెళ్తున్నాం. మిగతాది తర్వాత చూస్తాం అన్నారు.
పాకిస్థాన్ మ్యాచ్‌ను బహిష్కరించినా, భారత్ మాత్రం కొలంబో స్టేడియంలో హాజరుకావాల్సిందే. అప్పుడే ఫోర్ఫీట్ ద్వారా పాయింట్లు భారత్‌కు లభిస్తాయి. లాజిస్టిక్ పరంగా పెద్ద ఇబ్బంది లేకపోయినా, ఇది కేవలం ప్రతీకాత్మక నిరసనగానే మారే అవకాశం ఉంది.
