తిరుమలలో నెయ్యి సరఫరా టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు మాజీ సీఎం జగన్. టీటీడీకు సరఫరా చేసే నెయ్యి వ్యవహారంలో ఇప్పటి వరకు సుమారు రూ.200 కోట్ల స్కాం బయటపడిందని ఆయన తెలిపారు. ఉద్దేశపూర్వకంగా ఏడాది వ్యవధిలోనే కేజీ నెయ్యి ధరను రూ.351 నుంచి రూ.716 వరకు పెంచారని ఆరోపించారు.
ఈ అంశంపై తమ పార్టీ ఎమ్మెల్సీలు అసెంబ్లీలో ప్రశ్నలు లేవనెత్తినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి సరైన సమాధానం రాలేదని జగన్ విమర్శించారు. ముఖ్యంగా ఇందాపూర్ డెయిరీ మరియు హెరిటేజ్ ఫుడ్స్ మధ్య ఉన్న సంబంధాలపై ప్రశ్నించినా ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరగాలని జగన్ డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జగన్‌కు రిపోర్టర్లు కొన్ని రాజకీయ ప్రశ్నలు కూడా అడిగారు. చంద్రబాబు ఉప ప్రధాని అవుతారని వార్తలు వస్తున్నాయని ఒక రిపోర్టర్ ప్రశ్నించగా, జగన్ వ్యంగ్యంగా స్పందించారు. “చంద్రబాబును ముఖ్యమంత్రిగానే భరించలేకపోతున్నాం. ఇక ఉప ప్రధాని అయితే దేశ ప్రజలు ఎలా భరిస్తారు?” అని వ్యాఖ్యానించారు.
మరో రిపోర్టర్ అసెంబ్లీలో 11 మంది ఎమ్మెల్యేలు గెలిచినా 1100 మందిలా మాట్లాడుతున్నారని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యను కాంప్లిమెంట్‌గా తీసుకోవాలా అని అడిగారు. దీనికి జగన్ స్పందిస్తూ, “11 మంది ఎమ్మెల్యేలు 1100 మంది లెవల్లో ఆయనకు భయం పుట్టిస్తున్నారంటే అది మా సభ్యుల పనితీరుకు నిదర్శనం. వారికి క్రెడిట్ ఇవ్వాల్సిందే” అని అన్నారు.
చంద్రబాబు ఉప ప్రధాని అవుతారనే వార్తలు వారి అనుకూల మీడియానే రాస్తోందని కూడా జగన్ వ్యాఖ్యానించారు.
