గుంటూరు నగరంలో అత్యంత అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళను నడిరోడ్డుపై వివస్త్రను చేసి టీడీపీ నాయకుడు, అతని అనుచరులు దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ నెల 15వ తేదీన కృష్ణబాబు కాలనీలో ఒక మహిళ తన ఇంటి ముందు కుళాయి వద్ద మోటార్ ద్వారా నీళ్లు పట్టుకుంటోంది. అదే సమయంలో 21వ డివిజన్ టీడీపీ కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తి అక్కడికి చేరుకుని, ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఈ గొడవ కాస్తా తీవ్రరూపం దాల్చింది. ఆగ్రహంతో ఊగిపోయిన వెంకటరమణమూర్తి, అతని సోదరితో కలిసి ఆ మహిళపై, ఆమె కుటుంబ సభ్యునిపై దాడికి తెగబడ్డారు.
వెంకటరమణమూర్తి మరియు అతని అనుచరులు ఆ మహిళను వెంబడించి మరీ కొట్టారు. తనను వదిలిపెట్టమని ఆమె ఎంతగా వేడుకున్నా కనికరించకుండా, నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఆమెను వివస్త్రను చేసి అత్యంత దారుణంగా ప్రవర్తించారు. ఈ అమానవీయ దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.
బాధితురాలి ఫిర్యాదు మేరకు స్పందించిన పోలీసులు, టీడీపీ కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తి, అతని సోదరితో కలిపి మొత్తం 9 మందిపై కేసు నమోదు చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరోవైపు, ఈ ఘటనపై సీరియస్ అయిన స్థానిక వెస్ట్ ఎమ్మెల్యే గళ్ల మాధవి, నిందితుడు వెంకటరమణమూర్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మహిళా భద్రత పట్ల అత్యంత నిర్లక్ష్యంగా, అమానవీయంగా వ్యవహరించిన టీడీపీ నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన గుంటూరులో చర్చనీయాంశంగా మారింది.
