ఈ లోకంలో లేని నాన్న వైఎస్ఆర్ తాత రాజారెడ్డిలపై తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారం వారి రాజకీయ అక్కసును బయటపెట్టిందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సంజాయిషీ ఇచ్చుకోలేని స్థితిలో ఉన్న మరణించిన వ్యక్తులపై తప్పుడు ప్రచారం చేయడం నీచ రాజకీయాలకు పరాకాష్ట అని ధ్వజమెత్తుతూ సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరిగారు.
నిజంగా వారు అంత దుర్మార్గులే అయితే ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు విచారణ జరిపించలేదని ఎందుకు శిక్షించలేదని ఆమె ప్రశ్నించారు. ఆనాడు మీకు చేతకాలేదా అని నిలదీశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా చెప్పుకోదగ్గ విజయాలు సాధించలేకనే ఈ రకమైన గోల చేస్తున్నారని విమర్శించారు.
సొంతంగా ఎదిగే సత్తా లేక తమ పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే దివంగత నేతలను వివాదాల్లోకి లాగుతున్నారని ఆరోపించారు. పగబట్టి తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన పచ్చ చొక్కా నాయకులు ఉత్తములు అయిపోరని ఆకాశం మీద ఉమ్మేస్తే అది తిరిగి ఎక్కడ పడుతుందో రెండేళ్లుగా అధ్వాన్న పాలన సాగిస్తున్న అపర మేధావులు తెలుసుకోవాలని హితవు పలికారు.
సంక్షేమం అభివృద్ధి అనే పదాలకు కేవలం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమే చిరునామా అని షర్మిల పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా మన పర అనే భేదం లేకుండా పరిపాలన సాగించిన మహనీయుడు వైఎస్ఆర్ అని శ్లాఘించారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, రుణమాఫీ, ఉచిత కరెంట్ లాంటి విప్లవాత్మక పథకాలు కేవలం వైఎస్ఆర్ పరిపాలనలోనే సాధ్యమయ్యాయని చెప్పారు.
పోలవరం ప్రాజెక్టును మొదలుపెట్టి కేవలం ఐదేళ్లలోనే 33 శాతం పనులను వైఎస్ఆర్ పూర్తి చేస్తే ఆ తర్వాత రెండు సార్లు సీఎం అయిన చంద్రబాబు నాయుడికి మిగిలిన పనులు పూర్తి చేయడం చేతకాలేదని విమర్శించారు. రైతులకు రుణమాఫీ చేయడం చేతకాలేదని మాట ఇచ్చిన నిరుద్యోగ భృతి ఇవ్వడం చేతకాలేదని మహిళలకు ప్రతి నెలా ఇస్తామన్న రూ.1500 ఇవ్వడం చేతకాలేదని ఎండగట్టారు.
వైఎస్ రాజారెడ్డి చరిత్రను వక్రీకరిస్తే రాయలసీమ ప్రజలు ఎంతమాత్రం హర్షించరని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. ఆనాడు సీమలో జరిగిన అరాచకాలను ఎదురించి పేదల పక్షాన నిలబడిన గొప్ప వ్యక్తి రాజారెడ్డి అని కొనియాడారు. కడప జిల్లా ప్రజల కోసం 1973 లోనే ఆయన 70 పడకల ఆసుపత్రిని నిర్మించి ఉచిత వైద్యం అందించారని గుర్తు చేశారు. పేద బిడ్డల ఉన్నత చదువుల కోసం డిగ్రీ కాలేజీని పాలిటెక్నిక్ కళాశాలను కట్టించి ఉచిత విద్యను అందించిన ఘనత ఆనాడు కడప జిల్లాలో ఆయనకే దక్కిందన్నారు. ఎంతో మంది పేదల జీవితాలను నిలబెట్టిన మహా మనిషిని తప్పుగా చిత్రీకరించడం తగదన్నారు.
మహానేత వైఎస్ఆర్ పై ఎంత బురద జల్లాలని చూసినంత మాత్రాన సూర్యుడి కాంతి తగ్గదన్నట్లు ఆయన కీర్తిని చిన్నచేయలేరని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. కుహనా మేధావులైన టీడీపీ నేతలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వైఎస్ఆర్ ఒక మహానాయకుడని కొనియాడారు. వైఎస్ఆర్ లేరన్న వార్త విని అప్పట్లో ఏకంగా 700 మంది గుండెలు పగిలి మరణించారని గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంటి పూజ గదిలో ఆ మహానేతకు స్థానం దక్కిందని ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజల గుండెల్లో ఉన్న స్థానాన్ని ఎవరూ చెరపలేరని చెప్పారు.
ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి నిందలు వేయాలని చూసినా అపర భగీరథుడి లాంటి వైఎస్ఆర్ మీద మచ్చ తేలేరన్నారు. నేడు కడప జిల్లాలో ఫ్యాక్షనిజం లేదు అనడానికి వైఎస్ఆర్ తీసుకున్న చర్యలే కారణమనేది జగమెరిగిన సత్యమని పేర్కొన్నారు. అవగాహన రాహిత్యంతో దివంగత నేత వైఎస్ఆర్ ను నిందించాలని చూడటం ముఖ్యమంత్రి చంద్రబాబు టీంకు తగదని ఇకనైనా ఒట్టి మాటలు కట్టిపెట్టి ఓట్లేసిన ప్రజలకు మేలు తలపెట్టాలని డిమాండ్ చేశారు.
