అనంతపురం జిల్లాలో కూడేరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) రాజు ఉదంతం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఆయన అధికార పార్టీ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బుధవారం ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం ఇప్పేరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన డిజిటల్ మహానాడు (పసుపు పండుగ) వేడుకల్లో సీఐ రాజు పాల్గొనడం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ పరిధిలోని ఇప్పేరులో జరిగిన ఈ రాజకీయ వేడుకలో సీఐ రాజు ఒక సాధారణ కార్యకర్తలా వ్యవహరించడం గమనార్హం. మహానాడు సభా ప్రాంగణంలో టీడీపీ నాయకులు, కార్యకర్తల మధ్య కూర్చుని ఆయన సందడి చేశారు. అంతేకాకుండా అక్కడికి వచ్చిన పచ్చ చొక్కాల నాయకులతో కలిసి ఉత్సాహంగా సెల్ఫీలు, గ్రూప్ ఫొటోలు దిగారు. బాధ్యతాయుతమైన ఖాకీ దుస్తుల్లో ఉండి ఒక రాజకీయ పార్టీ పండుగలో పాల్గొనడం పట్ల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
కూడేరు సీఐ రాజు ఈ విధమైన వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో పోలీస్ స్టేషన్ లోపల పచ్చ కండువాలు కప్పుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను చేరదీసి కేక్ కటింగ్స్ నిర్వహించిన చరిత్ర ఆయనకు ఉంది. రక్షక భట నిలయాన్ని ఒక రాజకీయ పార్టీ కార్యాలయంగా మార్చేశారంటూ అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
పోలీస్ స్టేషన్‌కు వచ్చే సామాన్య జనం ఫిర్యాదులు చేయాలంటే టీడీపీ కండువాలు కప్పుకుని రావాలని సీఐ రాజు హుకుం జారీ చేయడం గమనార్హం. పచ్చ కండువా వేసుకుంటేనే కేసు నమోదు చేస్తానని ఆయన బహిరంగంగా చెప్పడం హేయమైన చర్యగా నిలిచింది.ఒక రాజకీయ పార్టీకి కొమ్ముకాస్తున్న సదరు పోలీస్ అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అంతా డిమాండ్ చేస్తున్నారు.
