వైద్యుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడమే కాకుండా, మరణం తర్వాత కూడా ఆ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. కాన్పు కోసం వెళ్లిన యువతి, నర్సు చేసిన పొరపాటు వల్ల ప్రాణాలు కోల్పోగా, ఆమె చితాభస్మంలో శస్త్రచికిత్సకు వాడే కత్తెర బయటపడటం సంచలనంగా మారింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం శంభూనిగూడెనికి చెందిన వనజ (20) గర్భిణి. పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను గుండాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో ఆసుపత్రిలో వైద్యులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో, అక్కడి నర్సు స్వయంగా కాన్పు చేసింది. అయితే, నర్సు నిర్లక్ష్యం, అవగాహన లోపం వల్ల పుట్టిన శిశువు అక్కడికక్కడే మరణించింది. కాన్పు తర్వాత వనజకు తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స పొందుతూ ఆమె కూడా మృతి చెందింది.
తల్లి, బిడ్డ మరణంతో కుంగిపోయిన కుటుంబ సభ్యులు, కర్మకాండలు పూర్తి చేశారు. అనంతరం చితాభస్మం సేకరిస్తుండగా, అందులో శస్త్రచికిత్సకు వాడే కత్తెర బయటపడింది. దీన్ని చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తమ కూతురు మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని, కాన్పు సమయంలోనే కత్తెర్లను లోపలే వదిలేశారని ఆరోపిస్తూ వారు బోరున విలపించారు. ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనపై స్పందించిన ఆసుపత్రి వైద్యాధికారులు, బాధితుల ఆరోపణలను తోసిపుచ్చారు. తాము వనజకు సాధారణ ప్రసవమే చేశామని, ఆ కత్తెర చితాభస్మంలో ఎలా వచ్చిందో తమకు తెలియదని వాదిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని స్థానికులు కోరుతున్నారు.
