- Advertisement -

ఏసీబీకి చిక్కిన అటవీ శాఖ అధికారులు

- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. లంచం తీసుకుంటూ అటవీ శాఖకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారులు ఏసీబీ వలలో చిక్కడం జిల్లాలో కలకలం రేపింది. అక్రమ సంపాదనకు అలవాటు పడి, అడిగినంత ఇస్తేనే పని చేస్తామంటూ బాధితులను వేధిస్తున్న అటవీ శాఖ అధికారుల ఆట కట్టించారు ఏసీబీ అధికారులు. భద్రాచలం ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్ (FDO) మరియు టేగడ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ (DRO) లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు.

జిల్లాలోని టేగడ ప్రాంతంలో అడవి చెట్లను అక్రమంగా ధ్వంసం చేసినట్లు ఒక వ్యక్తిపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో సదరు వ్యక్తిపై కేసు నమోదు చేయకుండా ఉండాలంటే భారీ మొత్తంలో లంచం ఇవ్వాలని అటవీ శాఖ అధికారులు డిమాండ్ చేశారు.అధికారుల వేధింపులు: భద్రాచలం ఎఫ్డీవో సంతపురి సుజాత, టేగడ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ భుక్యా కృష్ణలు బాధితుడిని బెదిరించి తొలుత రూ.10 లక్షలు లంచం డిమాండ్ చేశారు.

బాధితుడు అంత ఇచ్చుకోలేనని బ్రతిమాలడంతో, చివరికి రూ.3.50 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళిక రచించారు. గురువారం నాడు బాధితుడి నుంచి రూ.3.50 లక్షల నగదును అధికారులు తీసుకుంటుండగా ఏసీబీ బృందం మెరుపు దాడి చేసింది. ఎఫ్డీవో సుజాత, డీఆర్వో కృష్ణలను నగదుతో సహా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

పట్టుబడిన ఇద్దరు అధికారుల కార్యాలయాలు, నివాసాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. నిందితులను అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీకి ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -