ఉత్తరప్రదేశ్‌లోని మధురలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబంతో కలిసి బృందావనం సందర్శనకు వెళ్లిన ఓ 21 ఏళ్ల యువకుడు, విద్యుత్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయాడు.
కుటుంబ సభ్యులతో కలిసి బృందావనంలోని ఆలయానికి వెళ్లిన యువకుడు, బయట చెప్పులు విడిచిపెట్టే క్రమంలో అక్కడున్న కూలర్‌ను పట్టుకున్నాడు. దురదృష్టవశాత్తూ కూలర్‌కు విద్యుత్ సరఫరా అవ్వడంతో, విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
తన కొడుకు షాక్‌కు గురికావడం గమనించిన తండ్రి అనిల్, వెంటనే అతడిని కాపాడేందుకు ప్రయత్నించాడు. స్థానికుల సహాయంతో యువకుడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
కుమారుడు చనిపోయాడని తెలిసినా, ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. కొడుకును ఎలాగైనా బతికించుకోవాలన్న ఆశతో అతడికి సీపీఆర్ (CPR) చేస్తూ, “లే నాన్న.. నా కోసం లే” అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. ఈ దృశ్యం అక్కడున్న వారిని కలచివేసింది.
