సాయికృష్ణ అనుమానాస్పద మృతి (కస్టోడియల్ డెత్) కేసులో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుతం జరుగుతున్న సిట్ (SIT) మరియు మెజిస్టీరియల్ విచారణలు కేవలం కంటి తుడుపు చర్యలుగానే కనిపిస్తున్నాయని, బాధిత కుటుంబానికి న్యాయం జరగాలంటే స్వతంత్ర సంస్థ అయిన సీబీఐ (CBI) చేత దర్యాప్తు జరిపించాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది.
ఈ కేసుకు సంబంధించి మెజిస్టీరియల్ విచారణాధికారులకు మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్ బాబు తమ అభ్యంతరాలను, అనుమానాలను లిఖితపూర్వకంగా సమర్పించారు. మెజిస్టీరియల్ విచారణ అనంతరం మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఈ కేసును తూతూమంత్రంగా ముగించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. “ప్రభుత్వం కేవలం సీఐ నాగరాజును ఒక్కరినే బాధ్యుడిగా చూపించి ఈ కేసును మూసివేయాలని చూస్తోందనే బలమైన అనుమానాలు మాకు ఉన్నాయి. అసలు సాయికృష్ణను అదుపులోకి తీసుకోవాలని పైస్థాయి నుంచి ఎవరు ఆదేశాలు ఇచ్చారో రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం స్పష్టం చేయాలి. ఈ కేసు వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరో వెలుగులోకి రావాలి,” అని ఆయన డిమాండ్ చేశారు.
మార్కాపురం నుండి విజయవాడ వరకు ఉన్న అన్ని సీసీటీవీ (CCTV) ఫుటేజీలను తక్షణమే స్వాధీనం చేసుకుని బహిర్గతం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇది రాజకీయాలకు సంబంధించిన అంశం కాదని, పూర్తిగా మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన తీవ్రమైన విషయమని సుధాకర్ బాబు పేర్కొన్నారు. ప్రస్తుత విచారణలపై తమకు నమ్మకం లేనందున, నిజమైన దోషులను చట్టం ముందు నిలబెట్టడానికి సీబీఐ దర్యాప్తు ఒక్కటే మార్గమన్నారు.
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. మెజిస్టీరియల్ విచారణలో తమకున్న అన్ని అనుమానాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. సాయికృష్ణ కుటుంబానికి పూర్తి న్యాయం జరగాలన్నదే తమ తాపత్రయమని చెప్పారు.ప్రస్తుతం జరుగుతున్న విచారణల ద్వారా నిజాలు బయటకు వస్తాయనే నమ్మకం లేదు. ఈ కేసులో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చి, బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు వైయస్ఆర్ సీపీ ప్రజల తరఫున, ఆ కుటుంబం తరఫున తన పోరాటాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తుంది అని మల్లాది విష్ణు స్పష్టం చేశారు.
