తెలంగాణ సీనియర్ జర్నలిస్ట్ కేవీఆర్ (KVR) అరెస్ట్ వ్యవహారంలో చట్టాన్ని అతిక్రమించి, ఆయన భార్యతో అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయనగరం జిల్లా బొబ్బిలి రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) శ్రీనివాస్‌పై ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు. ఆయనను బొబ్బిలి రూరల్ నుండి విశాఖపట్నంలోని ఆరిలోవ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
నాలుగు రోజుల క్రితం ఒక కేసు విషయమై బొబ్బిలి రూరల్ సీఐ శ్రీనివాస్ నేతృత్వంలోని ఏపీ పోలీసుల బృందం హైదరాబాద్‌కు వచ్చింది. అక్కడ జర్నలిస్ట్ కేవీఆర్‌ను అదుపులోకి తీసుకుని బొబ్బిలికి తరలించారు. అయితే, ఈ అరెస్ట్ ప్రక్రియ సమయంలో సీఐ శ్రీనివాస్ తీవ్ర అరాచకానికి పాల్పడ్డారని, కేవీఆర్ భార్యతో అత్యంత అనుచితంగా, దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి.
దీనిపై కేవీఆర్ భార్య వెంటనే స్పందిస్తూ హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి వేళ ముందస్తు సమాచారం లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించారన్న ఫిర్యాదు మేరకు సరూర్‌నగర్ పోలీసులు సీఐ శ్రీనివాస్‌పై అధికారికంగా కేసు నమోదు చేశారు.మరో రాష్ట్రానికి చెందిన జర్నలిస్టు అరెస్ట్ వ్యవహారంలో నిబంధనలు పాటించకపోవడం, మహిళ పట్ల అనుచిత ప్రవర్తన ఆరోపణలపై కేసు నమోదు కావడంతో పోలీస్ ఉన్నతాధికారులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. ఈ క్రమంలోనే సీఐ శ్రీనివాస్‌ను అక్కడి నుంచి తక్షణమే బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.
కాగా ఇదే కేవీఆర్ కేసులో గతంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, ఆయనను అరెస్ట్ చేయడంలో విఫలమైన బాడంగి సబ్-ఇన్స్పెక్టర్ (SI)ను కూడా ఉన్నతాధికారులు ఇదివరకే వీఆర్ (వేకెన్సీ రిజర్వ్)కు పంపడం గమనార్హం. ఒకే కేసులో ఇద్దరు పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోవడం జిల్లా పోలీస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
