ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో పెను సంచలనం చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై పోలీసులకు ఫిర్యాదు అందడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సుగాలి ప్రీతి మరణానికి న్యాయం జరగాలంటూ సుదీర్ఘ కాలంగా పోరాడుతున్న ఆమె తల్లి సుగాలి పార్వతీ దేవి ఈ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
తన కుమార్తె సుగాలి ప్రీతి మరణంపై పవన్ కల్యాణ్ ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడుతున్నారని పార్వతీ దేవి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఒకసారి ప్రీతిని మానభంగం చేసి చంపేశారని మాట్లాడిన ఆయన.. ఇప్పుడు మాత్రం ఎలాంటి ఆధారాలు లేవని నిందితులకు క్లీన్ చిట్ ఇస్తున్నారని ఆమె మండిపడ్డారు. తనకు న్యాయం చేయాలని అడిగినప్పుడల్లా పవన్ కల్యాణ్ జనసేన శ్రేణులను తనపైకి ఉసిగొల్పుతున్నారని..దీంతో జనసేన నేతలు తనపై దాడులకు తెగబడుతున్నారని ఆమె ఆరోపించారు.
పవన్ కల్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు హోంమంత్రికి, డిప్యూటీ సీఎంకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదు. సుగాలి పార్వతీ దేవి…ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్న తనకు న్యాయం చేయాల్సింది పోయి, ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. ఈ ఉన్నత స్థాయి ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
