ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వివాదాస్పద ‘బీచ్ షాక్స్’ విధానానికి వ్యతిరేకంగా విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో నిరసన జ్వాలలు మిన్నంటాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) మహిళా విభాగం పిలుపు మేరకు పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు, స్థానికులు ఈ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవా తరహా సంస్కృతిని ఆంధ్రప్రదేశ్‌లోకి తీసుకువచ్చి.. అందమైన, ప్రశాంతమైన విశాఖ తీరాన్ని మందుబాబుల అడ్డాగా మార్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని వారు మండిపడ్డారు.
మద్యం విక్రయాలకు అనుమతినిచ్చే జీవో నెంబర్ 362ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు నల్ల రిబ్బన్లు ధరించి, చేతుల్లో నల్ల బెలూన్లు పట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆర్కే బీచ్ రోడ్డులో బైఠాయించారు. పర్యాటక రంగం అభివృద్ధి పేరుతో తీర ప్రాంతాల్లో మద్యం దుకాణాలు, షాక్‌లను ఏర్పాటు చేయడం వల్ల స్థానిక సంస్కృతి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
విశాఖపట్నం బీచ్‌లకు నిత్యం వేలాది మంది మహిళలు, పిల్లలు, వృద్ధులు, ఉదయం వేళల్లో వాకర్స్ వస్తుంటారని నిరసనకారులు గుర్తు చేశారు. ఇక్కడ ఓపెన్ బార్లు, షాక్‌లు ఏర్పాటు చేస్తే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని, మహిళలపై వేధింపులు మరియు నేరాలు పెరిగే అవకాశం ఉందని భయాందోళన వ్యక్తం చేశారు. కేవలం మద్యం ఆదాయం కోసమే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ జీవోను వెనక్కి తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వైఎస్సార్సీపీ మహిళా నేతలు హెచ్చరించారు.
