సినీ ప్రపంచంలో మెరిసే తారల వ్యక్తిగత జీవితం ఎప్పుడూ ఒక మిస్టరీగానే మిగిలిపోతుంటుంది. తెరపై నవ్వులు చిందిస్తూ లక్షలాది మంది అభిమానుల మనసు గెలుచుకున్న హీరోయిన్లు, వాస్తవ జీవితంలో ఎన్నో కన్నీటి కథలను దాచుకుంటారు. తాజాగా ఒకప్పటి స్టార్ హీరోయిన్, ‘సూర్యం’ ఫేమ్ సెలీనా జైట్లీ జీవితంలో జరిగిన ఒక చేదు అనుభవం ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అంగరంగ వైభవంగా సాగిపోతుందనుకున్న ఆమె దాంపత్య జీవితం, ఒకే ఒక్క రోజులో ఊహించని మలుపు తిరగడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.
2011లో ఆస్ట్రియాకు చెందిన పీటర్ హాగ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సెలీనా, కెరీర్‌కు దూరంగా విదేశాల్లో స్థిరపడింది. బయటి ప్రపంచానికి వీరిద్దరూ ఆదర్శ దంపతులుగా కనిపించినా, వారి మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు ఇప్పుడు బయటపడ్డాయి. తమ 15వ వివాహ వార్షికోత్సవం రోజున సెలీనా జీవితంలో విషాదం చోటుచేసుకుంది. భర్త నుంచి ఏదో సర్ప్రైజ్ గిఫ్ట్ ఆశించిన సెలీనాకు, అతను ఊహించని షాక్ ఇచ్చాడు. జర్మన్ భాషలో ఉన్న కొన్ని లీగల్ పత్రాలను ఆమె చేతిలో పెట్టి, ఏమాత్రం కనికరం లేకుండా నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడు.
ఆ పత్రాలు విడాకుల నోటీసులని తర్వాత తెలిసింది. అత్యంత బాధాకరమైన విషయమేమిటంటే, ఆ నోటీసులో సెలీనాపై ఆమె భర్త చేసిన అసహ్యకరమైన ఆరోపణలను స్వయంగా తన పిల్లల నుంచే ఆమె వినాల్సి వచ్చింది. ఆ క్షణం సెలీనా మనసు ముక్కలైంది. కేవలం విడాకులకే పరిమితం కాకుండా, తనను మానసికంగా, శారీరకంగా వేధించారని ఆమె ఆరోపిస్తోంది. ముంబై వెళ్లకుండా అడ్డుకోవడం, పిల్లల కోసం ఆస్ట్రియాలోనే ఉండి చిన్న ఉద్యోగం చేసుకోమని కండిషన్లు పెట్టడం వంటి వేధింపులు ఆమెను తీవ్ర వేదనకు గురిచేశాయి.
ప్రస్తుతం సెలీనా గృహహింస కేసు నమోదు చేసి, తన భర్తపై న్యాయపోరాటానికి దిగింది. గ్లామర్ ప్రపంచాన్ని ఏలిన ఒక స్టార్ హీరోయిన్, ఈ రోజు కోర్టులు, కేసుల చుట్టూ తిరుగుతూ కన్నీరు మున్నీరు కావడం చూస్తుంటే సినీ రంగుల ప్రపంచం వెనుక ఉన్న అసలైన చీకటి కోణం అర్థమవుతోంది. స్టార్డమ్ ఉన్నా, లేకున్నా మహిళలు ఎదుర్కొనే వేధింపులు ఒకేలా ఉంటాయని సెలీనా ఉదంతం మరోసారి నిరూపించింది. ఈ కష్ట సమయంలో ఆమె ధైర్యంగా నిలబడి తన హక్కుల కోసం పోరాడటం అందరినీ ఆలోచింపజేస్తోంది.
