దేశంలో తొలి హైడ్రోజన్ రైలు పట్టాలెక్కెతోంది. మొట్టమొదటిసారిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. రేపు (జులై 17న) ఈ రైలు ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. హర్యానాలోని 89 కిలోమీటర్ల జింద్-సోనిపట్ మార్గంలో పైలట్ ప్రాజెక్టుగా ఈ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. పర్యావరణ హిత రవాణా దిశగా భారత రైల్వే వేసిన ఈ అడుగు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.
హైడ్రోజన్ రైలు భారతీయ రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించనున్నది. జింద్ నుంచి సోనిపట్ మధ్య ఆ రైలు నడవనున్నది. ఈ రెండు స్టేషన్ల మద్య 89 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ రైలులో మొత్తం 10 కోచ్‌లు ఉంటాయి. గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో దీన్ని డిజైన్ చేశారు. ఫ్యూయల్ సెల్ డీపీఆర్ఎస్ విధానంలో రైలు నడవనున్నది. 1200 కిలోవాట్ల ప్రొపల్షన్ సిస్టమ్ ఆ రైలుకు ఉంటుంది. 2025లో జింద్-సోనిపట మధ్య ట్రయల్స్ విజయవంతంగా నిర్వహించారు. మే 22వ తేదీన 10 కోచ్‌ల హైడ్రోజన్ రైలు కోసం రైల్వే బోర్డు అనుమతి ఇచ్చింది. హైడ్రోజన్ ట్రైన్ నెంబర్ 74010 జింద్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 740 నిమిషాలకు బయలు దేరుతుంది. ఆ తర్వాత సోనిపేట్‌కు 9.40 నిమిషాలకు చేరుకుంటుంది. ఫ్యూయల్ సెల్స్ ఆధారంగా హైడ్రోజన్ రైలు విద్యుత్తను ఉత్పత్తి చేస్తుంది.
పది కోచ్‌లు కలిగిన ఈ రైలు గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఇందులో సుమారు 2,600 మంది ప్రయాణించే వీలుంది. టికెట్ ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండేలా రూ. 5 నుంచి రూ. 25 మధ్య నిర్ణయించారు. జింద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక హైడ్రోజన్ ఫిల్లింగ్ స్టేషన్ ద్వారా ఇంధనాన్ని సరఫరా చేస్తారు. ఇప్పటికే అన్ని రకాల భద్రతా పరీక్షలను పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ పాఠశాల విద్యార్థులతో కలిసి కొంత దూరం ప్రయాణించే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే, దేశవ్యాప్తంగా మరో 35 హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ ప్రణాళికలు సిద్దం చేస్తోంది.
