హైదరాబాద్‌లోని వాసవి ఇంజినీరింగ్ కాలేజీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాలేజీ యాజమాన్యం, ఫ్యాకల్టీ సభ్యుల నిరంతర వేధింపులు, అవమానకర ప్రవర్తనను భరించలేక సెకండ్ ఇయర్ విద్యార్థిని శ్రేయ బలవన్మరణానికి పాల్పడింది. మరణానికి ముందు ఆమె రాసిన సూసైడ్ నోట్ ప్రస్తుతం తీవ్ర కలకలం రేపుతోంది.
ఫస్టియర్ పరీక్షల సమయంలో తెలియక హాల్‌లోకి సెల్‌ఫోన్ తీసుకెళ్లిన శ్రేయను ఫ్యాకల్టీ పరీక్షల నుంచి డీబార్ చేశారు. తాను కావాలని తీసుకెళ్లలేదని, తెలియక తెచ్చానని ఎంత బతిమాలినా వారు కనికరించలేదు. ఆ చిన్న సంఘటనను మనసులో పెట్టుకున్న సిబ్బంది, ఆమె సెకండ్ ఇయర్ చదువు మొదలైనప్పటి నుంచి టార్గెట్ చేసి వేధించడం మొదలుపెట్టారు. గత మూడు నెలలుగా ఆమెపై మానసిక హింసను కొనసాగించారు.
ఫ్యాకల్టీ సభ్యులు శ్రేయను ఉద్దేశించి ‘‘సిగ్గు, శరం ఉండదు.. కొన్ని జీవితాలు ఎప్పటికీ మారవు’’ అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. మరో ఫ్యాకల్టీ అయితే ‘‘పరీక్షల్లో నువ్వు దొరుకుతావని అనుకుంటే.. మరొకరు దొరికారు’’ అంటూ మరింత అవమానకరంగా కామెంట్లు చేశారు. ఇలా రోజూ కళాశాలలో అందరి ముందు సూటిపోటి మాటలతో ఆమెను క్షోభకు గురిచేశారు.
ఈ అవమానాలను తట్టుకోలేకపోయిన శ్రేయ తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. తాను చనిపోతున్నానని చెబుతూ ‘అమ్మ, నాన్న.. నన్ను క్షమించండి’ అని సూసైడ్ లెటర్‌లో పేర్కొంది. అంతేకాకుండా, తన చావు వార్త కాలేజీలో ఎవరికీ తెలియకూడదని, ఒకవేళ తెలిస్తే వారు బాధపడటం సంతోషిస్తారే తప్ప పశ్చాత్తాపపడరని ఆవేదన వ్యక్తం చేసింది. తమ కుమార్తె ప్రాణాల బలికి కారణమైన కాలేజీ యాజమాన్యం, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
