చెన్నై నుంచి దిల్లీ వెళ్లే రైలులో ఓ సూట్‌కేస్‌లో మానవ శరీర భాగాలు లభించిన కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన మిస్టరీని చెన్నై పోలీసులు ఛేదించారు. ఓ మహిళను అత్యంత కిరాతకంగా హతమార్చి, ఆమె శరీర భాగాలతో నిందితులు బిర్యానీ వండినట్లు గుర్తించారు.
ఈ నెల 5వ తేదీన చెన్నై నుంచి దిల్లీ బయలుదేరిన తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఆ రైలులోని ఓ జనరల్ కంపార్ట్‌మెంట్‌లో తీవ్రమైన దుర్వాసన వస్తుండటంతో ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బోగీలో తనిఖీ చేశారు. అక్కడ అనుమానాస్పదంగా ఉన్న ఎరుపు రంగు సూట్‌కేస్‌ను స్వాధీనం చేసుకుని తెరచి చూశారు. అందులో మానవ శరీర భాగాలు ఉండడం చూసి వారు షాకయ్యారు. ఆ సూట్‌కేస్ చెన్నై నుంచి వచ్చినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
దీంతో ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు తమిళనాడు రైల్వే పోలీసులను సంప్రదించారు. చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్ పరిసరాల్లోని 350కి పైగా సీసీ కెమెరాల పుటేజీలను పోలీసులు పరిశీలించారు. ఎరుపు రంగు సూట్‌కేస్‌తో వచ్చిన ఒక వ్యక్తి, మహిళ రైల్లో సూట్‌కేస్ పెట్టి దిగిపోయినట్లు గుర్తించారు. ఆ తర్వాత వారు సబర్బన్ రైలెక్కి గూడువాంజేరి చేరుకున్నట్లు తేల్చారు. ఆ ఆచూకీ ఆధారంగా వారి ఇల్లును గుర్తించి పోలీసులు తనిఖీ చేశారు. అక్కడ ఒడిశాకు చెందిన మాణిక్ ఉత్తిన్ లస్కర్, అతని భార్య భాగమతి మాజిక్ ఉంటున్నట్లు వెల్లడైంది. వారితో పాటు హయాత్ నిషా అనే మహిళ కూడా ఉంటోందని తెలిసింది. హత్యకు గురైంది ఆమేనని పోలీసులు నిర్ధారించారు.
నిందితుల ఇంటికి వెళ్లి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఇల్లంతా రక్తపు మరకలు కనిపించాయి. అక్కడ ఓ బిర్యానీ పాత్ర కనిపించగా, దాని చుట్టూ మైదాపిండి అతికించి ఉంది. మూత తీసి చూడగా రైస్‌తో పాటు మానవ శరీర భాగాలు కనిపించడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఆ పాత్రను స్వాధీనం చేసుకుని ఆసుపత్రికి తరలించారు. హత్యకు గురైన మహిళ తల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
