- Advertisement -

ఎన్నికలకు సిద్ధం కావాలి: జగన్‌

- Advertisement -

స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు అందరూ సిద్ధం కావాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. గెలుపే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా పని చేయాలని స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లిలో రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గ నేతలతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గ ఇంఛార్జి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణతో పాటు స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ పార్టీ శ్రేణులను ఉద్దేశించి దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని ఆయన అన్నారు. ఏ ఒక్క వర్గమూ ఈ ప్రభుత్వ పాలనలో సంతోషంగా లేదన్నారు. ప్రజల్లో ఉన్న ఈ వ్యతిరేకత స్థానిక ఎన్నికల్లో కనబడకుండా చేసేందుకు అధికార పార్టీ పోలీసులు ప్రయోగిస్తోందని ఆరోపించారు. వీటన్నింటినీ ఎదుర్కొని ధైర్యంగా యుద్ధం చేయాలని కోరారు. మన పార్టీకి ప్రజల్లో అత్యంత ప్రజాదరణ ఉందని, అందుకే స్థానిక ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని వైఎస్‌ జగన్‌ ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని జగన్ మండిపడ్డారు. ఇసుక, మట్టి, మద్యం మాఫియాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని విమర్శించారు. గంజాయి రవాణా చేస్తూ ఏకంగా పోలీసులే పట్టుబడుతున్నారని, వ్యవస్థలు ఆ స్థాయికి దిగజారాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దారుణాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంకను కారుతో పదే పదే ఢీకొట్టి అత్యంత దారుణంగా చంపేశారని గుర్తుచేశారు. ఆ కేసు బయటకు రాకుండా తొక్కి పెట్టే ప్రయత్నం చేశారని, పోలీసులు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై ఇలాంటి దుర్మాగ్యాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.

చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని జగన్ విమర్శించారు. విద్యార్థులు, రైతులు, మహిళలు, అవ్వాతాతలు, ఉద్యోగులు, వ్యాపారులు.. ఇలా ఏ ఒక్క వర్గం కూడా ఈ ప్రభుత్వంతో సంతోషంగా లేదన్నారు. కూటమి ప్రభుత్వంపై రెండేళ్లలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. మరోవైపు మన వైఎస్సార్‌సీపీపై ప్రజల్లో రోజురోజుకీ ఆదరణ పెరుగుతోందని తెలిపారు. ప్రజలంతా మన ఐదేళ్ల పాలనను, ప్రస్తుత కూటమి పాలనతో పోల్చి చూస్తున్నారని పేర్కొన్నారు. నిత్యం ప్రజలతో మమేకమై పని చేయాలని పార్టీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -