- Advertisement -

రక్తపు మడుగులో భ‌ర్త‌, కుమారుడు.. ఫోన్ చూస్తూ భార్య‌..

- Advertisement -

కర్ణాటకలోని ధార్వాడలో వెలుగుచూసిన డాక్టర్ కిరణ్ హత్యోదంతం స్థానికంగా సంచలనం సృష్టించింది. రంకా స్టెల్లో అపార్ట్‌మెంట్‌లో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనలో భర్త కిరణ్‌ను కత్తితో పొడిచి చంపిన భార్య డాక్టర్ ప్రియాంకను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుపై నగర పోలీసు కమిషనర్ శశికుమార్ మరిన్ని వివరాలను వెల్లడించారు.

విజయపురలో స్థిరపడిన నేత్ర వైద్యురాలు ప్రియాంక, హెబ్బాళ గ్రామానికి చెందిన అనస్థీషియా వైద్యుడు కిరణ్ తొమ్మిదేళ్ల క్రితం మ్యాట్రిమోనీ యాప్ ద్వారా పరిచయమై ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇది రెండో వివాహం. బుధవారం కిరణ్ తన ఫ్లాట్‌లో దారుణ హత్యకు గురయ్యారు. గురువారం మధ్యాహ్నం వరకు కిరణ్ నుంచి స్పందన లేకపోవడంతో ఆసుపత్రి సిబ్బంది, బంధువులు ఆందోళన చెందారు. వారు ప్రియాంకకు ఫోన్ చేయగా, “కిరణ్ నిద్రపోతున్నారు” అని ఆమె నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది.

సందేహం వచ్చిన బంధువులు ఇంటికి వచ్చి కిటికీలోంచి చూడగా, సోఫాలో ప్రియాంక ప్రశాంతంగా ఫోన్ చూసుకుంటూ ఉండటం, రక్తపు మడుగులో కిరణ్, ఆయన ఎనిమిదేళ్ల కుమారుడు పడి ఉండటం చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు అక్కడికి చేరుకుని కొన ఊపిరితో ఉన్న కుమారుడిని ఆసుపత్రికి తరలించారు.

ఘటనా స్థలిని పరిశీలించిన పోలీసులు, కిరణ్ ఒంటిపై పది కత్తిపోట్లు, కుమారుడిపై మూడు కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. ప్రియాంక మానసిక స్థితిపై అనుమానం ఉండటంతో ఆమెను చికిత్స నిమిత్తం కిమ్స్ (KIMS) ఆసుపత్రికి తరలించారు. ఫ్లాట్‌లోని సీసీటీవీ ఫుటేజ్, దంపతుల ఫోన్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుమారుడు కోలుకున్నాక అసలు ఏం జరిగిందో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని కమిషనర్ తెలిపారు. కుటుంబసభ్యుల సమక్షంలో గురువారం కిరణ్ అంత్యక్రియలు జరిగాయి. ప్రియాంక మానసిక స్థితి కారణంగానే ఈ ఘాతుకానికి పాల్పడిందా లేక మరేదైనా కారణం ఉందా అన్నది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -