కాకినాడలో సంచలనం సృష్టించిన పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబ సామూహిక ఆత్మహత్య కేసుకు సంబంధించి విస్మయకర నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు షేక్ సాధిక్‌ఖాన్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
తనకన్నా పదేళ్లు పెద్ద వయసున్న సౌజన్యను సాధిక్ మాటలతో మభ్యపెట్టాడు. ఆమె ప్రైవేటు వీడియోలు, చాటింగ్ సంభాషణలతో బ్లాక్‌మెయిల్ చేశాడు. ఈ వేధింపులు భరించలేక ఆ కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. సౌజన్య రాసిన లేఖ ఆధారంగా ఆమె భర్త జగదీశ్వరరెడ్డి మరణంలోనూ సాధిక్ పాత్ర ఉందని పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనకు సంబంధించి జరిగిన ముఖ్యమైన తేదీల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 16 ఇంజినీరు నూకరాజు, భార్య మీనా, కుమార్తె సౌజన్య, మనవడు కార్తికేయరెడ్డి రాజమహేంద్రవరం రోడ్డు కం రైలు వంతెన పైనుంచి రాత్రి గోదావరి నదిలోకి దూకేశారు. చిన్నారి కార్తికేయకు ఈత రావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అదే రోజు రాత్రి 12.45 గంటలకు సామర్లకోట రైల్వేస్టేషన్ నుంచి కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో సాధిక్ పరారయ్యాడు.
17న ఏఈ నూకరాజు మృతదేహం లభ్యమైంది. ఆయన కారులో సూసైడ్ నోట్ లభించింది. సౌజన్య రాసిన లేఖల ఆధారంగా సాధిక్‌పై హత్యాయత్నం కేసు నమోదైంది. 20న సౌజన్య మృతదేహం రావులపాలెం మండలం కొమరాజులంక వద్ద బయటపడింది.
22న ఏఈ భార్య మీనా మృతదేహాన్ని ఆలమూరు మండలం మూలస్థానం వద్ద గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుడు సాధిక్‌ఖాన్‌ను ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్‌పై కాకినాడకు రప్పించారు.
24న సాధిక్‌ను కాకినాడ కోర్టులో హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయస్థానం అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
