వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన్ని, వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేసి కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆ పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలతో పార్టీ శ్రేణుల్లో అపోహలు రాకూడదనే ఉద్దేశంతోనే ఈ స్పష్టత ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీలో వైఎస్ జగన్ ఒక్కరే నాయకుడని, మిగతా వారందరం కార్యకర్తలమేనని సజ్జల స్పష్టం చేశారు.
పార్టీలో విజయసాయిరెడ్డికి వచ్చినన్ని పదవులు మరెవరికీ రాలేదని సజ్జల గుర్తుచేశారు. రాజ్యసభ సభ్యత్వం, జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నేత, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వంటి అత్యున్నత బాధ్యతలు ఆయనకే దక్కాయని చెప్పారు. 2020 నుంచి తనను వెనక్కి లాగారంటున్న సాయిరెడ్డిని, పార్టీ 2022లో రెండోసారి ఎందుకు రాజ్యసభకు పంపిందని ప్రశ్నించారు. పార్టీని వీడే సమయంలో వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నానని చెప్పిన ఆయన, ఇప్పుడు వేరేలా మాట్లాడటం తప్పుమన్నారు.
వైఎస్ జగన్పై విజయసాయిరెడ్డి చేస్తున్న మతమార్పిడి ఆరోపణలు అత్యంత దారుణమని సజ్జల ఖండించారు. వైఎస్ కుటుంబం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తుందని దశాబ్దాలుగా వారివెంట ఉన్న సాయిరెడ్డికి బాగా తెలుసన్నారు. కొత్త రాజకీయ ప్రయాణం కోసం లేదా పబ్లిసిటీ కోసమే వైఎస్ జగన్ను, వైఎస్సార్సీపీని టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే ధోరణి కొనసాగితే పార్టీ తరఫు నుంచి మరింత ఘాటైన సమాధానం ఉంటుందని హెచ్చరించారు.
వైఎస్ జగన్ను ఎవరో ఒక ‘కోటరీ’ నడిపిస్తోందన్న ప్రచారం పూర్తిగా అవాస్తమని సజ్జల స్పష్టం చేశారు. ఎలాంటి పొత్తులు లేకుండా పార్టీని స్థాపించి, రికార్డు మెజారిటీతో అధికారంలోకి వచ్చిన నాయకుడిపై ఇలాంటి లబ్ధి లేని విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకైనా, సాధారణ ఎన్నికలకైనా వైఎస్సార్సీపీ పూర్తి సిద్ధంగా ఉందని తెలిపారు. ఎల్లో మీడియా, ఫేక్ ఫ్యాక్టరీల ద్వారా జగన్పై జరుగుతున్న విషప్రచారాన్ని ప్రజలు నమ్మరని సజ్జల పేర్కొన్నారు.
