పంజాబ్‌లోని చండీగఢ్‌లో అత్యంత అమానుష ఘటన వెలుగు చూసింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ను కొందరు దుండగులు చెట్టుకు కట్టేసి నిప్పంటించి కిరాతకంగా హత్య చేశారు. కొన్ని వారాల పాటు మృత్యువుతో పోరాడిన బాధితురాలు చివరకు ఆసుపత్రిలో కన్నుమూసింది. ఈ సంచలన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చండీగఢ్‌కు చెందిన మంజీత్ కౌర్ (28) సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు పొందింది. మృతురాలికి ఇదివరకే వివాహం జరిగి విడాకులు కాగా, ఆమెకు ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. గత జూలై 3న మంజీత్‌కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. సెక్టార్ 34లోని మద్యం షాప్ వద్దకు రావాలని శుభి, పిందా అనే ఇద్దరు వ్యక్తులు ఆమెను ఫోన్ చేసి పిలిచారు.
ఆ మాట నమ్మి అక్కడికి వెళ్లిన మంజీత్‌ను ఆ ఇద్దరు బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. అక్కడి నుంచి ఆమెను మొరిండా ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను ఒక చెట్టుకు కట్టేసి విచక్షణారహితంగా దాడి చేశారు. ఆపై ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.
అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ పరిచయస్తుడు దీన్ని గమనించాడు. వెంటనే స్పందించి దుప్పటితో మంటలనుార్పాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. కొన్ని వారాల పాటు అపస్మారక స్థితిలోనే మంజీత్ చికిత్స పొందింది.
చివరకు ఆగస్టు 5న ఆమె స్పృహలోకి వచ్చి తనపై జరిగిన ఘోరాన్ని పోలీసులకు, కుటుంబ సభ్యులకు వివరించింది. అయితే నిందితుల్లో ఒకరు గతంలో మంజీత్‌తో సహజీవనం చేసినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాల కారణంగా ఆరోగ్యం మరింత విషమించడంతో ఆగస్టు 26న మంజీత్ తుదిశ్వాస విడిచింది. ప్రస్తుతం ఈ ఘటనకు పాల్పడిన నిందితులు ఇద్దరూ పరారీలో ఉన్నారు. పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేశారు.
