భారత్, ఇంగ్లండ్ మధ్య నేటి నుంచి ఇక్కడి ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో తొలి టెస్టుకు స్వం సిద్ధం అయ్యింది. సుదీర్ఘ టెస్టు సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు ఉండే ప్రాధాన్యతే వేరు. ఇక్కడ గెలిచి శుభారంభం చేస్తే మానసికంగా ఆ జట్టు బలం రెట్టింపవుతుంది. విదేశీ గడ్డపై మొదటి మ్యాచ్‌లో వెనుకబడి భారత్ సిరీస్‌లో ఆధిక్యం ప్రదర్శించిన సందర్భాలు చాలా అరుదు. కాబట్టి ఈ సారైనా విజయంతో మొదలు పెట్టాలని టీమిండియా పట్టుదలగా ఉంది.
నంబర్ వన్ టెస్టు జట్టుగా ఉన్న టీమిండియా ఇంగ్లిష్ గడ్డ మీద ఎలాగైనా సిరీస్ గెలవాలనే కసితో బరిలో దిగుతోంది. మరోవైపు సొంత గడ్డ మీద భారత్‌పై అద్భుత రికార్డ్ ఉన్న ఇంగ్లాండ్ జట్టు 1000వ టెస్టులో చిర్మసరణీయ విజయం సాధించాలని ఆశిస్తోంది. తొలి టెస్టుకు ఎడ్జ్‌బాస్టన్ ఆతిథ్యం ఇస్తుండగా.. ఈ వేదికపై భారత రికార్డు పేలవంగా ఉంది. ఇక్కడ ఆరు టెస్టులు ఆడితే టీమిండియా ఐదింట్లో ఓడి ఒక్క మ్యాచ్‌ను మాత్రం డ్రాగా ముగించింది.
2014లో ఇక్కడ ఆఖరి టెస్టు ఆడిన భారత తుది జట్టు నుంచి కనీసం ఆరుగురు ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో కూడా ఆడబోతున్నారు. విజయ్, పుజారా, రహానే, అశ్విన్, ఇషాంత్‌లతో పాటు విరాట్ కోహ్లి ఈ జాబితాలో ఉన్నాడు. అయితే ఎవరు ఎలా ఆడినా కోహ్లిని మాత్రం నాటి సిరీస్ జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ సారి కచ్చితంగా బాగా ఆడాల్సిన స్థితిలో అతను బరిలోకి దిగుతుండగా, కెప్టెన్‌గా జట్టును గెలిపించాల్సిన బాధ్యత కూడా అతనిపై ఉంది. వరల్డ్ టాప్ బ్యాట్స్‌మన్‌గా కోహ్లి తన స్థాయిని ప్రదర్శిస్తే భారత్ ఆధిపత్యం ప్రదర్శించడం ఖాయం.
ఇంగ్లాండ్ గడ్డ మీద భారత్ విజయాల రికార్డ్ పేలవంగా ఉంది. 57 టెస్టులు ఆడితే కేవలం ఆరు మ్యాచ్‌ల్లోనే గెలుపు బావుటా ఎగరేసింది. భారత్‌కు టెస్టుల్లోని తిరుగులేని విజయాలు అందించిన మహేంద్ర సింగ్ ధోనీకి కూడా ఇంగ్లిష్ గడ్డ మీద చేదు అనుభవమే ఎదురైంది. 2011లో మహీ సారథ్యంలోని భారత జట్టు 4-0 తేడాతో చిత్తుగా ఓడగా.. 2014లో 3-1 తేడాతో సిరీస్ కోల్పోయింది.
గత ఐదేళ్లుగా ఉపఖండం వెలుపల భారత్ చెప్పుకోదగ్గ స్థాయిలో విజయాలు సాధించలేదు. కేవలం వెస్టిండీస్‌లో మాత్రమే టెస్టు సిరీస్ నెగ్గింది. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా గడ్డపై జరిగిన టెస్టు సిరీస్‌లో పోరాడినప్పటికీ.. జట్టు ఎంపికలో తప్పిదాల వల్ల మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది
మరోవైపు సొంత గడ్డ మీద ఇంగ్లాండ్ ఉత్సాహంగా బరిలో దిగుతోంది. ఇటీవలి కాలంలో ఆ జట్టు టెస్టుల్లో పేలవ ఆటతీరు కనబరుస్తోంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌పై చూపిన శ్రద్ధను లాంగ్ ఫార్మాట్‌పై కనబర్చడం లేదు. దీంతో గత ఏడాది సెప్టెంబర్ ఆ జట్టు తొమ్మిది టెస్టులు ఆడితే ఒక్క మ్యాచ్‌లోనే గెలుపొందింది. వెస్టిండీస్, పాకిస్థాన్‌లు కూడా ఆ జట్టును ఓడించాయి.మొదటి టెస్ట్‌లో కోహ్లీసేన గెలిచి చరిత్రసృష్టిస్తుందో లేదో చూడాలి.
తుది జట్లు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), విజయ్, ధావన్, రాహుల్/పుజారా, రహానే, కార్తీక్, పాండ్యా, అశ్విన్, ఉమేశ్, ఇషాంత్, కుల్దీప్/షమీ.
ఇంగ్లండ్: రూట్ (కెప్టెన్), కుక్, జెన్నింగ్స్, మలాన్, బెయిర్‌స్టో, స్టోక్స్, బట్లర్, రషీద్, కరన్, బ్రాడ్, అండర్సన్.
