మహకూటమిలో సీట్ల పంపకాల వ్యవహారం ఓ కొలిక్కి వస్తోంది. ప్రధానంగా టీడీపీ కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం దాదాపు పూర్తయినట్టే. టీడీపీ 30 స్థానాలు అడుగుతుండటంతో కాంగ్రెస్ 19 చోట్ల పోటీకి అంగీకరించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో టీడీపీ తమకు బలమైన క్యాడర్ ఉన్న అసెంబ్లీ స్థానాలతో పాటు కాంగ్రెస్ పట్టు తక్కువగా ఉన్న స్థానాలను కోరుతోంది. గత ఎన్నికల్లోనూ 15 ఎమ్మెల్యేలను గెల్చుకున్నామని, తమకు ఇప్పుడు లీడర్లు లేకపోయీనా, క్యాడర్ బలంగానే ఉందని వాళ్లు చెబుతున్నారు. అందుకే సికింద్రాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, ఖైరతాబాద్, కోరుట్ల, హుజూరాబాద్, దేవరకద్ర, మక్తల్, మహబూబ్నగర్, ఉప్పల్, ఆలేరు, కోదాడ, మిర్యాలగూడ, ఖమ్మం, ఆర్మూర్, పరకాల లేదా వరంగల్ వెస్ట్, సత్తుపల్లి నియోజకవర్గాలు పొత్తులో భాగంగా తమకు కేటాయించాలని కోరుతోంది. ఈ స్థానాల్లో కచ్చితంగా టీడీపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ కోరుతున్న ఆ నియోజకవర్గాల్లో మొదటి నుంచి ఆ పార్టీనే నమ్ముకుని ఉన్న బలమైన అభ్యర్ధులనే బరిలో దించాలని కాంగ్రెస్ టీడీపీ భావిస్తున్నాయి. కచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నవారినే పోటీలో నిలపాలని ప్లాన్ చేస్తున్నాయి. ప్రధానంగా క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ టీడీపీ మధ్య దశాబ్దాలుగా వైరం ఉండటంతో, ఇప్పుడు గ్రౌండ్ లేవెల్లో ఆ వైరం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇరు పార్టీలు తీసుకోవాలని నిర్ణయించాయి, పొత్తులు, సీట్లు పంపకాల కంటే క్షేత్రస్థాయిలో ఓట్లు మార్పిడి ప్రధానం కనుక, బూత్ లెవల్లో పొత్తులపై ఇరు పార్టీల కార్యకర్తల మధ్య సఖ్యత కుదిర్చి ఓట్లు మార్పుడి జరిగేలా వ్యూహరచన చేస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీ మధ్య పాత గొడవలు, దశాబ్దాల శతృత్వాన్ని మళ్లీ వెలికి తీసి, రెచ్చగొట్టే ప్రయత్నాలను టీఆర్ఎస్ చేస్తుంది కనుక అప్రమత్తంగా ఉండాలని మహాకూటమిలో వ్యూహరచన జరిగింది. ప్రస్తుతానికి 19 టికెట్లు ఇవ్వటానికి అంగీకరించిన కాంగ్రెస్ టీడీపీ డిమాండ్ తో మరో 4 సీట్లు వరకూ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
