సార్వత్రిక ఎన్నికల పమయం దగ్గరపడుతున్న కొద్దీ నాయకుల చేరికతో వైసీపీ బలోపేతం అవుతోంది. ప్రజాసంకల్ప యాత్రలో జగన్‌కు వస్తున్న ప్రజాస్పందనను చూసి పలువురు నాయకులు పార్టీలో జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతం జగన్ శ్రీకాకుళం జిల్లాలో 328వ రోజు ప్రజాసంకల్ప యాత్ర కొనసాగిస్తున్నారు.
పాదయాత్రలో గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నారాంబాబు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ స్వయంగా పార్టీ కండువా కప్పి ఆయనను వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయన అనుచరులు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
2009 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం టికెట్ పై గిద్దలూరు నియోజకవర్గం నుంచి రాంబాబు గెలుపొందారు. 2014లో ఆయన టీడీపీ తరఫున పోటీచేసి పరాజయం పాలయ్యారు. ఇటీవలి కాలంలో రాంబాబు వైసీపీలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. వైసీపీలో అన్నా రాంబాబు చేరికపై ప్రకాశం జిల్లాలో ఉన్న వైశ్య సామాజిక వర్గ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
మరో వైపు జగన్ చేపట్టిన పాదయాత్ర మరో మైలు రాయిని చేరుకుంది. రావివలస వద్ద 3500 కిలోమీటర్ల మార్క్‌ను దాటింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ పార్టీ జెండాను ఆవిష్కరించి మొక్కను నాటారు. జననేత 328వ రోజు పాదయాత్రను శనివారం ఉదయం టెక్కలి నియోజకవర్గంలోని దామోదరపురం క్రాస్ నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి రావివలస, నౌపడ క్రాస్, జయకృష్ణాపురం, గోపినాథపురం మీదుగా టెక్కలి వరకు పాదయాత్ర కొనసాగనుంది.
