భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణం’ (Ramayana) గురించిన ఆసక్తికర విషయాన్ని దర్శకుడు నితీశ్ తివారీ తాజాగా వెల్లడించారు. ఈ సినిమా మొదటి భాగం ప్రేక్షకులను ఎంతో ఉత్కంఠకు గురిచేసేలా, ఓ భారీ క్లిఫ్‌హ్యాంగర్‌తో ముగుస్తుందని ఆయన స్పష్టం చేశారు.
అమెరికాలో జరుగుతున్న ‘శాన్ డిగో కామిక్-కాన్ (SDCC) 2026’ వేదికగా నిర్వహించిన రామాయణం ప్యానెల్‌లో దర్శకుడు నితీశ్ తివారీ, నటులు రణ్‌బీర్ కపూర్, యశ్, నిర్మాత నమిత్ మల్హోత్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నితీశ్ తివారీ.. రామాయణం లాంటి విశాలమైన కథను ఒకే చిత్రంలో చూపించడం అసాధ్యమని, అందుకే దీన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మొదటి భాగం ముగింపు ప్రేక్షకులను ఎంతగానో ఆలోచింపజేస్తుందని, థియేటర్ నుంచి బయటకు రాగానే రెండో భాగం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసేలా ఈ కథను డిజైన్ చేసినట్లు వెల్లడించారు. పార్ట్-1 ఎక్కడ ఆపితే బాగుంటుందనే అంశంపై తాము ఎంతో ఆలోచించి సరైన పాయింట్‌ను ఎంచుకున్నామని ఆయన పేర్కొన్నారు.
ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే ప్రచార చిత్రాలు భారీ హైప్‌ను సృష్టించాయి. అయితే అధికారికంగా ట్రైలర్ విడుదల కాకపోయినా, న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ‘ప్రథమ్ సంకల్ప్’ వేడుక, ముంబై మరియు కామిక్-కాన్ స్క్రీనింగ్‌ల నుంచి లీకైన కొన్ని క్లిప్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. మరోవైపు, రణ్‌బీర్ కపూర్ మాట్లాడుతూ తాను ఇప్పటివరకు రామాయణం క్లైమాక్స్ సన్నివేశాలను షూట్ చేయలేదని తెలిపారు. లీకైన వీడియోలను నిరోధించేందుకు నిర్మాత నమిత్ మల్హోత్రా మరియు లీగల్ టీమ్ యాంటీ-పైరసీ డ్రైవ్‌ను కూడా ప్రారంభించాయి.
భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ మైలాజికల్ పాన్ ఇండియా చిత్రంపై దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్ త్వరలోనే అధికారికంగా ట్రైలర్‌ను విడుదల చేయాలని అభిమానులు కోరుతున్నారు. రెండు భాగాలుగా రానున్న ఈ దృశ్యకావ్యం భారతీయ సినిమా చరిత్రలో మరో అద్భుత సంచలనం సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
