ప్రభుత్వ ఉద్యోగులపై, అందులోనూ ఉపాధ్యాయులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. వైయస్సార్ కడప, అనంతపురం, సత్యసాయి జిల్లాలకు చెందిన ఐదుగురు ఉపాధ్యాయ సంఘాల నేతలను సస్పెండ్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. సీనియర్ టీచర్లకు టెట్ (TET) నిబంధన నుంచి మినహాయింపు కోరుతూ ఎంపీల సహకారంతో కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడం నేరమా అని నిలదీశారు. ప్రభుత్వం చేయాల్సిన పనిని తాము చేస్తే రాజకీయ ముద్ర వేసి సస్పెన్షన్లు విధిస్తారా అని ధ్వజమెత్తారు.
చంద్రబాబు ప్రభుత్వం రెడ్‌బుక్ రాజ్యాంగంతో అరాచక పాలన సాగిస్తోందని జగన్ ఆరోపించారు. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఈ టెట్ నిబంధనపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తెవలేదని ప్రశ్నించారు. సమస్యను పరిష్కరించాల్సిందిపోయి, టీచర్లపై సస్పెన్షన్ల వేటు వేయడం దారుణమని మండిపడ్డారు. వెంటనే ఆ ఐదుగురు టీచర్లపై విధించిన సస్పెన్షన్లను ఎత్తివేయాలని, లేదంటే ఆ టీచర్లకు న్యాయపరంగా పూర్తిగా అండగా నిలుస్తామని ఆయన హెచ్చరించారు.
ఉద్యోగుల విషయంలోనూ సీఎం చంద్రబాబు మోసపూరితంగా వ్యవహరిస్తున్నారని జగన్ విమర్శించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని, ప్రభుత్వం వచ్చి మూడో ఏడాది నడుస్తున్నా ఇప్పటివరకు ఐఆర్ (IR) లేదు, పీఆర్సీ (PRC) లేదు, కనీసం అయిదు డీఏలు కూడా పెండింగ్‌లోనే ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఎస్‌పై ఆశ చూపించి త్రిశంకుస్వర్గంలో పెట్టారని దుయ్యబట్టారు.
ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ బకాయిలు, డీఏలు, జీపీఎఫ్, మెడికల్ రీయింబర్స్‌మెంట్, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ వంటి వివిధ రూపాల్లో దాదాపు రూ.35 వేల నుంచి రూ.40 వేల కోట్ల వరకు బకాయిలు పెట్టి ఒక్క పైసా కూడా ఇవ్వలేదని జగన్ మండిపడ్డారు. న్యాయమైన డబ్బుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు సస్పెన్షన్లను బహుమానంగా ఇస్తున్నారని విమర్శించారు. అధికారమదంతో, నియంతృత్వ ధోరణితో చెలరేగిపోతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని, అన్యాయాన్ని ప్రశ్నించే ప్రతి గొంతుకూ వైయస్సార్‌సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
