పెళ్లి వేడుకలోనే దొంగ చేతివాటం ప్రదర్శించిన ఘటన రాజస్థాన్‌లో కలకలం రేపింది. Jaipur నగరంలోని జగత్‌పురా ప్రాంతం చందన్ వాన్‌లో ఫిబ్రవరి 7న జరిగిన వివాహంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. నూతన వధూవరులు బంధువులతో కలిసి స్టేజ్‌పై ఫోటోలు దిగుతూ హడావిడిగా ఉన్న సమయంలో దొంగ తన పని ముగించాడు.
వధువు పక్కనే ఉంచిన బ్యాగ్‌ను గమనించిన నిందితుడు, ఎవరూ గమనించకుండా సైలెంట్‌గా దానిని తీసుకుని అక్కడి నుంచి మాయమయ్యాడు. ఆ బ్యాగ్‌లో సుమారు రూ.4 లక్షల నగదు, అలాగే విలువైన ఆభరణాలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే నిర్వాహకులు, కుటుంబ సభ్యులు వెతికినా బ్యాగ్ కనిపించలేదు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పెళ్లి వీడియోలు, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నారు. వీడియోలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తుల వివరాలను సేకరిస్తున్నారు.
పెళ్లి వంటి ఆనంద వేడుకలో జరిగిన ఈ దొంగతనం స్థానికంగా ఆందోళన కలిగించింది. పెద్ద ఎత్తున జనసమ్మర్థం ఉండే కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.
