అమెరికాలో భారీ నగల దోపిడీ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. 2025లో కాలిఫోర్నియాలోని ఒక నగల దుకాణంలో జరిగిన ఈ దోపిడీ ఘటనలో దుండగులు నిమిషంలోనే కోట్ల రూపాయల విలువైన బంగారం, వజ్రాలను దోచుకెళ్లారు.
పోలీసులు తాజాగా విడుదల చేసిన సీసీటీవీ వీడియోలో దోపిడీ దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాదాపు 24 మంది మాస్కులు ధరించిన దుండగులు ఒకేసారి దుకాణంలోకి చొరబడి, అక్కడ ఉన్న షోకేస్లను ధ్వంసం చేసి బంగారం, వజ్రాలను సంచుల్లో వేసుకుని పారిపోయారు. ఈ ఘటన మొత్తం ఒక నిమిషం వ్యవధిలోనే జరిగిపోయింది.
ఈ దోపిడీ భారత వ్యాపారి నిర్వహిస్తున్న కుమార్ జ్యువెల్లర్స్లో జరిగింది. దుండగులు సుమారు 1.7 మిలియన్ డాలర్ల (భారత కరెన్సీలో దాదాపు రూ.16 కోట్లకు పైగా) విలువైన నగలను దోచుకెళ్లినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంత పెద్ద దోపిడీని కేవలం నిమిషంలోనే జరిపిన విధానం చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
