కర్ణాటకలోని విజయపుర జిల్లాలో భూమి కోసం జరిగిన పాత కక్షలు తీవ్ర వినాశనానికి దారితీశాయి. ఒకే గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులను ప్రత్యర్థులు తుపాకులతో కాల్చి.. ఆపై కత్తులతో నరికి అత్యంత ఘోరంగా మట్టుబెట్టారు. ఈ భయంకరమైన సామూహిక హత్యల ఉదంతం శుక్రవారం రాత్రి విజయపుర జిల్లా చడచన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోవింద్‌పూర్ గ్రామంలో వెలుగుచూసింది. ఈ రక్తపాతం స్థానికంగా తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది.
పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం.. గోవింద్‌పూర్ గ్రామానికి చెందిన నిరాలే, గొలగి కుటుంబాల మధ్య గత కొంతకాలంగా ఒక భూమి విషయమై తీవ్రమైన వివాదాలు నడుస్తున్నాయి. ఈ సుదీర్ఘ భూవివాదం మనస్సులో పెట్టుకున్న ప్రత్యర్థులు పక్కా ప్రణాళికతో ఈ దాడులకు తెగబడ్డారు. మరణించిన బాధితులను చందు నిరాలే, దుండప్ప నిరాలే, శివపుత్ర నిరాలే, రాహుల్ నిరాలే, సమర్థ్ నిరాలే, షబ్బీర్ నదాఫ్‌లుగా పోలీసులు గుర్తించారు. మృతులంతా గోవింద్‌పూర్ గ్రామ నివాసితులే కావడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా గొలగి కుటుంబ సభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. నిందితులు బాధితులపై మొదట కాల్పులు జరిపి.. ఆపై వారు తప్పించుకోకుండా కత్తులతో విచక్షణారహితంగా నరికి చంపినట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన వెంటనే ఉన్నతాధికారులు పోలీసు బలగాలతో గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎలాంటి అరెస్టులు కాలేదని.. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.
