తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (TG MDC) ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ ఇసుక రీచ్‌పై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొందరు పచ్చ నేతలు బరితెగించి దాడికి పాల్పడ్డారు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం తుమ్మిళ్ల గ్రామంలోని ఇసుక క్వారీ వద్ద సోమవారం మధ్యాహ్నం ఈ దౌర్జన్యం చోటుచేసుకుంది. ప్రభుత్వ రీచ్‌లో విధులు నిర్వహిస్తున్న సైట్ ఇంచార్జి ఎల్వీ చౌదరి (లక్ష్మీనారాయణ చౌదరి) పై గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు విచక్షణా రహితంగా భౌతిక దాడికి దిగారు.
బాధితుడు ఎల్వీ చౌదరి మరియు సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు రెండు కార్లలో ఆరుగురు వ్యక్తులతో కలిసి తుమ్మిళ్ల ఇసుక రీచ్‌కు చేరుకున్నారు. అక్కడ విధుల్లో ఉన్న సైట్ ఇంచార్జి చౌదరిపై ఒక్కసారిగా దాడి చేసి, కిందపడేసి పిడిగుద్దులు గుద్దుతూ, కాళ్లతో తన్నారు.
అంతటితో ఆగకుండా ఇనుప రాడ్లతో భయభ్రాంతులకు గురిచేస్తూ…సాయంత్రంలోగా నిన్ను చంపేస్తాం.. ఇదే మా ఠాగూర్ అన్న ఆర్డర్ అంటూ తీవ్రంగా బెదిరించారు. అనంతరం ఇసుక రీచ్‌కు సంబంధించిన రికార్డు బుక్కులు (స్టాక్ బుక్స్) మరియు సుమారు రూ. 4 లక్షల నగదు ఉన్న బ్యాగును బలవంతంగా లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ దాడి ఘటనలో ప్రధాన నిందితులుగా ఇద్దరు కీలక వ్యక్తులను గుర్తించారు. దాడి చేసిన వ్యక్తిని ఆడుసుమిల్లి శ్రీధర్ గా గుర్తించారు. ఈ ఇసుక రీచ్‌ను ఏపీకి చెందిన ప్రసాద్ అనే కాంట్రాక్టర్ నిర్వహిస్తుండగా, గతంలో వ్యాపార భాగస్వామిగా ఉన్న గుత్తికొండ ఠాగూర్‌తో ఏర్పడిన పాత విభేదాల నేపథ్యంలోనే పక్కా ప్రణాళికతో ఈ దౌర్జన్యానికి ఒడిగట్టినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. టీడీపీ దుండగుల దాడితో ప్రాణభయంతో వణికిపోయిన సైట్ ఇంచార్జి, సిబ్బంది వారి బారి నుండి ఎలాగోలా తప్పించుకుని నేరుగా రాజోలి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. తమపై దాడి చేసి, ప్రభుత్వ రికార్డులు, నగదు ఎత్తుకెళ్లిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న రాజోలి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సరిహద్దు ప్రాంతంలోని ప్రభుత్వ ఇసుక రీచ్‌లో ఏపీ నేతలు ఈ తరహా దౌర్జన్యానికి తెగబడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రభుత్వ సిబ్బందిపై దాడికి పాల్పడిన ‘పెద్ద తలకాయలను’ సైతం చట్టం ముందు నిలబెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
