‘లెనిన్’ చిత్రంతో తన కెరీర్లో తొలి విజయాన్ని అందుకున్న నటి భాగ్యశ్రీ బోర్సే, ఆ సక్సెస్ ఇచ్చిన అనుభూతిని, సినీ ప్రయాణం పట్ల తనకున్న పరిణతిని తాజాగా పంచుకున్నారు. ఈ విజయం తనకెంతో ప్రత్యేకం అని, తొలి విజయం ఇచ్చే స్వచ్ఛమైన ఆనందం మళ్లీ దక్కకపోవచ్చని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.
సినిమా విజయాన్ని బాక్సాఫీస్ వసూళ్లతో కొలవడంపై భాగ్యశ్రీ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “ప్రేక్షకులు తెరపై భాగ్యశ్రీని చూడకూడదు, నేను పోషించిన పాత్రలనే చూడాలి.. అప్పుడే అది నిజమైన విజయం. ఒకవేళ నటనలో నేను తప్పు చేస్తే అది నా ఫెయిల్యూర్‌గా ఒప్పుకుంటా, కానీ వసూళ్లు తక్కువ రాగానే హీరోయిన్స్‌ని విమర్శించడం సరికాదు” అని ఆమె అభిప్రాయపడ్డారు.
సినిమా పరాజయాలకు హీరోయిన్లను బాధ్యులను చేస్తూ ‘ఐరన్ లెగ్’ వంటి మాటలు వాడటంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. “కథ, ఎడిటింగ్, తుది నిర్ణయాల్లో నటి పాత్ర పరిమితంగా ఉంటుంది. కాబట్టి, విమర్శలు వచ్చినప్పుడు దర్శకుడు, నిర్మాతలతో పాటు నటీమణులను కూడా సమానంగా చూడాలి” అని ఆమె స్పష్టం చేశారు. సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ వంటి వారిని స్ఫూర్తిగా తీసుకుంటున్న ఆమె, విజయం ఆలస్యంగా వస్తేనే కెరీర్ సుదీర్ఘంగా సాగుతుందని బలంగా నమ్ముతున్నారు.
ఏ కథనైనా ఒక సగటు ప్రేక్షకుడి కోణంలో విని, అది మనసును తాకేలా ఉంటేనే నటిస్తానని భాగ్యశ్రీ వెల్లడించారు. కథల ఎంపికలో ఎవరి ప్రభావం ఉండదని, తన అంతరాత్మ చెప్పిన మాటే వింటానని ఆమె చెప్పారు. ‘లెనిన్’ ప్రాజెక్ట్ తన దగ్గరకు తిరిగి రావడాన్ని దేవుడి దయగా భావిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.
సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన తాను, తండ్రి పడిన కష్టాలను చూస్తూ పెరిగానని భాగ్యశ్రీ తెలిపారు. ఆ ఆర్థిక ఇబ్బందులే తనను కష్టపడి పనిచేసేలా బలంగా మార్చాయని, ఏనాడు నిరాశ పడలేదని ఆమె స్పష్టం చేశారు. భవిష్యత్తులో రాజమౌళి దర్శకత్వంలో నటించాలని, దర్శకత్వం చేయాలనే లక్ష్యాలు ఉన్నాయని ఆమె తన మనసులోని కోరికలను పంచుకున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ బ్యానర్లో శివకార్తికేయన్‌తో కలిసి ఒక సినిమా చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
