తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. కార్యకర్తల సమావేశంలో తన భర్తను గుర్తు తెచ్చుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపినాథ్. దీనిపై కాంగ్రెస్ మంత్రులు మాటల దాడి మొదలుపెట్టారు. మాగంటి సునీత కన్నీళ్లు పెట్టి గెలవాలని చూస్తుంది..సెంటిమెంట్ వర్కవుట్ కాదని తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.
గతంలో రాజీవ్ గాంధీ చనిపోతే ఎవరూ మీ లాగా దిక్కుమాలిన వ్యాఖ్యలు చేయలేదు అని కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు. భర్తలు చనిపోతే మహిళలు ఏడుస్తారు కదా? అలాంటి మహిళల గురించి అంత దిగజారే విధంగా మాట్లాడతారా? చెప్పాలన్నారు. పక్కన ఇద్దరు మహిళలు, పీజేఆర్ కూతురు, మేయర్ విజయలక్ష్మిని ఉండగా డ్రామా అంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు.
తుమ్మల నాగేశ్వరరావు గతంలో పాలేరు ఉప ఎన్నికలో అనారోగ్యంతో మృతి చెందిన రాంరెడ్డి వెంకట్ రెడ్డి భార్య మీద పోటీ చేసి గెలిచాడు .. మంత్రి హోదాలో ఉండి భర్తను కోల్పోయి కన్నీరు పెడుతున్న మహిళను అవమానిస్తారా? చెప్పాలన్నారు. తుమ్మల నాగేశ్వరరావు వెంటనే మహిళలందరికీ క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు.
మాగంటి సునీత చనిపోయిన తన భర్తను గుర్తుకువచ్చి ఏడుస్తుంటే యాక్షన్ అంటారా? అని మండిపడ్డారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. కమ్మ సామాజిక వర్గం మద్దతుతోనే నువ్వు మంత్రి అయ్యావు కదా తుమ్మల నాగేశ్వరరావు … మరి అదే సామాజిక వర్గానికి చెందిన ఆడబిడ్డ దుఃఖంలో ఉంటే అవమానిస్తావా? చెప్పాలన్నారు. మాగంటి గోపినాథ్ చనిపోయినప్పుడు సునీత ఎంత బాధ పడిందో, మీరు అనే మాటలకు అంతకంటే ఎక్కువ బాధపడుతుంది… ఆమెను అవమానించిన మంత్రులు వెంటనే సునీతకు క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేశారు.
