పుణె సమీపంలోని లోహగఢ్ కోట వద్ద వ్యాపారవేత్త కేతన్ విశాల్ అగర్వాల్ మృతి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మొదట ప్రమాదవశాత్తూ లోయలో పడి మరణించాడని భావించిన ఈ ఘటన, ఇప్పుడు పక్కా ప్రణాళికతో చేసిన హత్యగా తేలడంతో స్థానికంగా కలకలం రేపింది.
పుణెలోని గహుంజేకు చెందిన 26 ఏళ్ల వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ జూన్ 18న లోహగఢ్ కోట వద్ద 400 అడుగుల లోయలో పడి మృతి చెందారు. ట్రెక్కింగ్‌కు వెళ్లిన సమయంలో తనను ఫోటో తీస్తుండగా కేతన్ ప్రమాదవశాత్తూ లోయలో పడిపోయారని అప్పట్లో ఆయన కాబోయే భార్య పోలీసులకు చెప్పారు. ప్రమాద ఘటనగా భావించి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, విచారణలో భాగంగా ఆమె చెబుతున్న సమాధానాల్లో పొంతన లేకపోవడంతో పోలీసులకు అనుమానం కలిగింది.
పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా, ఇది ప్రమాదం కాదని, ముందస్తు ప్రణాళిక ప్రకారం చేసిన హత్య అని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ కేసులో కేతన్ కాబోయే భార్యతో పాటు, ఆమె మిత్రుడిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ కేతన్‌ను లోయలోకి తోసి, ఆ తర్వాత ప్రమాదంగా చిత్రీకరించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్న మరో ఆరుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
కేతన్ అగర్వాల్ తన కుటుంబ స్థిరాస్తి వ్యాపారంలో డైరెక్టరుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవలే ఆయనకు వివాహం నిశ్చయమైంది. నవంబర్‌లో జరగాల్సిన వివాహం కోసం ఉదయ్‌పూర్‌లో ఖరీదైన ప్యాలెస్‌ను కూడా బుక్ చేశారు. కాబోయే భార్య పుట్టినరోజు వేడుకల కోసం జూన్ 19న మిత్రులతో కలిసి లోహగఢ్ కోటకు వెళ్లిన కేతన్, ఇలా దారుణ హత్యకు గురికావడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
