మహిళా సంఘం నాయకురాలి వేధింపులు తాళలేక ఒక రైల్వే ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తిరుపతి జిల్లా రేణిగుంటలో కలకలం రేపింది. ఇప్పటికే మూడు వివాహాలు చేసుకున్న సదరు మహిళ, రైల్వే ఉద్యోగిని తన వలలో వేసుకుని నిలువునా దోచుకోవడమే కాకుండా, పోలీసుల సమక్షంలోనూ వేధించడంతో బాధితుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
తూర్పుగోదావరి జిల్లా కడియంకు చెందిన రవి, రేణిగుంటలో రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఆయనకు ఉషారాణి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. మహిళా సంఘం నాయకురాలిగా చలామణి అవుతున్న ఉషారాణితో రవి మూడేళ్లపాటు సహజీవనం చేశారు. ఈ క్రమంలో ఆమెకు ఇదివరకే మూడు వివాహాలు జరిగాయన్న విషయం తెలిసి, రవి ఆమెకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
అయితే, తనను వదలకూడదని ఉషారాణి రవిని తీవ్రంగా వేధించడం మొదలుపెట్టింది. తన పేరును రైల్వే సర్వీస్ రికార్డుల్లో నామినీగా చేర్చాలని, అంతేకాకుండా రూ. కోటి విలువైన ఇన్సూరెన్స్ పాలసీకి కూడా తననే నామినీగా పెట్టాలని ఆమె డిమాండ్ చేసింది.
ఉషారాణి వేధింపుల గురించి రవి ఇప్పటికే రేణిగుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు స్పందించి సదరు మహిళా సంఘం, సీపీఐ నాయకుల సమక్షంలో రాజీ చేసుకోవాలని రవికి సలహా ఇచ్చినట్లు సమాచారం. పోలీసుల తీరుతో మనస్తాపం చెందిన రవి, బుధవారం మధ్యాహ్నం తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
చనిపోయే ముందు రవి ఒక సూసైడ్ నోట్ రాసి ఉంచారు. తనపై తప్పుడు కేసులు పెట్టి ఉషారాణి చేస్తున్న వేధింపుల గురించి అందులో వివరించారు. ఉషారాణి అసలు గుట్టును, ఆమె మ్యాట్రిమోని వెబ్‌సైట్ల ద్వారా మరో పెళ్లికి ప్రయత్నిస్తున్న విషయాన్ని ఆధారాలతో సహా పోలీసులకు ఇచ్చినా వారు పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రవి మరణానికి కారణమైన ఉషారాణిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
