ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. రాబోయే స్థానిక పోరులో సీట్ల సర్దుబాటు, జనసేన పార్టీ వ్యూహాలపై రాష్ట్ర మంత్రి, జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రయోజనాల కోసం వెనక్కి తగ్గామని, కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అలాంటి పద్ధతి ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.
మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ..2024 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో అనుసరించిన వ్యూహాన్ని గుర్తు చేసుకున్నారు.గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఎన్డీయే (NDA) కూటమిని బలోపేతం చేయడం కోసం జనసేన పార్టీ పెద్ద మనసుతో వ్యవహరించింది. కూటమి ప్రయోజనాలే పరమావధిగా భావించి, వెనక్కి తగ్గి నాలుగు సీట్లు తక్కువ తీసుకున్నాం. ఆ త్యాగం వల్లే కూటమి చారిత్రాత్మక విజయం సాధించింది అని తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల నాటి సీట్ల సర్దుబాటు ఫార్ములాను రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఆపాదించలేమని ఆయన కుండబద్దలు కొట్టారు. స్థానిక సమరంలో జనసేన పార్టీ తన పూర్తి శక్తిసామర్థ్యాలతో బరిలోకి దిగుతుందని స్పష్టం చేశారు. సాధారణ ఎన్నికల్లో చూపిన ఉదారత లేదా సీట్ల సర్దుబాటు ఫార్ములా స్థానిక ఎన్నికల్లో వర్తించదు. గ్రామ, మండల, మున్సిపల్ పరిధిలో జనసేన పార్టీ బలంగా ఉంది. కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా పార్టీకి తగిన స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యం అన్నారు.
సొంత బలాన్ని నిరూపించుకునే అవకాశం: స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా క్షేత్రస్థాయిలో జనసేన పట్టును మరింత పటిష్టం చేసుకోవాలని పార్టీ భావిస్తోంది. జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అత్యంత ఆప్తుడైన నాదెండ్ల మనోహర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
